మోదీపై ట్వీటు.. దివ్య స్పందనపై కేసు నమోదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘దొంగ’ అని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత, కన్నడ సినీ నటి దివ్యా స్పందన(రమ్య) ట్వీట్‌ చేయడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలోని గోంతీ నగర్‌ పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. సయ్యద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 124-ఏ (దేశద్రోహం), సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 67 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో మోదీని ఉద్దేశించి అభ్యంతరకర రీతిలో ఫొటో పోస్ట్ చేసి ఆయనను దొంగగా పేర్కొంది. ‘దేశ కాపలాదారు దొంగ’ అంటూ కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ట్వీటు చేశారు.

ప్రజాస్వామ్యపరంగా ఎన్నికైన ప్రధాని మోదీపై ద్వేషాన్ని కక్కుతూ ఆయనను కించపర్చుతూ దివ్య ట్వీట్‌ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తనపై కేసు నమోదయిందని తెలుసుకున్న దివ్య.. ‘ఓ.. మంచిది’ అంటూ కొద్దిసేపటి క్రితం తన ట్విటర్‌ ఖాతాలో స్పందించారు. ‘సోమవారం దివ్యా స్పందన మోదీని తీవ్రంగా కించపర్చుతూ ట్వీట్ చేశారు. మోదీ తన చిత్రంపై తానే చోర్‌ (దొంగ) అని రాసుకుంటున్నట్లు అది ఉంది’ అని ఆమెపై ఫిర్యాదు చేసిన న్యాయవాది రిజ్వాన్‌ అహ్మద్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపారు.

కాగా, రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్‌, బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్, దేశీయ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మాజీ చీఫ్‌ సువర్ణ రాజు ఇటీవల వివరణలు ఇచ్చిన తరువాత మోదీపై కాంగ్రెస్‌ మరిన్ని విమర్శలు చేస్తోంది.