పోలవరం విలీన మండలాల ప్రజలకు కన్నా భరోసా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం అర్పించిన విలీన మండలాల ప్రజలు ప్రస్తుతం పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు మరిన్ని సమస్యలతో సతమతమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వాసితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీయిచ్చారు. 

తూర్పు గోదావరి జిల్లా చింతూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ సంస్కృతి, సంప్రదాయాలు, తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు తమ ప్రాణాలనే పణంగా పెట్టిన ముంపు ప్రాంతాల ప్రజలు త్యాగమూర్తులని కొనియాడారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో విలీన మండలాల ప్రజలు సమస్యలతో సతమతమయ్యారని, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 

రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో విలీన మండలాల ప్రజలకు మాయ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు జగన్మోహన్‌రెడ్డి చొరవ చూపడంలేదని ఆరోపించారు.

విలీన మండల ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణం జరిగేలా కృషిచేస్తానని కన్నా లక్ష్మీనారాయణ ముంపు ప్రజలకు హామీ ఇచ్చారు.