భారతదేశం ధర్మసత్రమేమీ కాదు  

ఎవరు పడితే వారు ఈ భూభాగంపై నివసించేందుకు భారతదేశం ధర్మసత్రమేమీ కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ కో ఇన్‌చార్జి సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చి నివసిస్తున్న అక్రమ, వలసదారులైన ముస్లిం మైనార్టీలందరికీ భారత పౌరసత్వం కల్పించేందుకే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చామని తెలిపారు.  

పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ గందరగోళానికి గురిచేస్తున్నాయని అనంతపూర్ లో ఆరోపించారు. ఈ చట్టం వల్ల భారతదేశ పౌరులైన ముస్లింల ఉనికికి ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇచ్చారు. ముస్లిం దేశాల నుంచి వివిధ రూపాల్లో భారత్‌లోకి వచ్చి నివసిస్తున్న వారి కోసమే పౌరసత్వ చట్ట సవరణ చేశామని పేర్కొన్నారు. 

వారు భారతీయ పౌరులుగా ఉండటానికి ఇష్టపడకపోతే వారిపై మానవత్వం చూపాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చి పోషించే బాధ్యత భారత దేశానికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ మతానికి ముడిపెట్టి రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్, ఇండియాలో కాంగ్రెస్‌పార్టీ నేత రాహుల్‌గాంధీ మాట్లాడే మాటలు ఒకే తీరుగా ఉన్నాయని య్యబట్టారు. 

భారత్‌లో పౌరసత్వం పొందేందుకు ఇష్టం లేని వారికి మీ దేశంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించండి అని ముస్లిం దేశాలకు సునీల్ దియోధర్ సూచించారు. 1947లో పాకిస్తాన్‌లో మైనార్టీలు 20 శాతం ఉండగా, ఇప్పుడు వారి జనాభా 9.9 శాతానికి పడిపోయిందని, అంతమంది ఏమయ్యారు? వారిని ఆ దేశం సరిగా పట్టించుకుంటే ఈ పరిస్థితి ఉండేదా? అని నిలదీశారు. 

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో ‘చక్మా’ తెగ వారిని విభజన సమయంలో పాకిస్తాన్‌లో కలిపేశారని, ఇది అప్పటి భారత ప్రధాని నెహ్రూ చేసిన పెద్ద తప్పిదం అని ఆరోపించారు. ఇప్పుడు చక్మా జాతి కనీసం 20 శాతం కూడా లేదన్నారు. అస్సాంలో తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో నివసిస్తున్న ముస్లిం మైనార్టీలు, బుద్ధిస్టులు, తదితరులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరినా, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తాము చట్టం చేస్తే వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి మార్పును బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ, వైసీపీ పని చేస్తున్నాయని, ఇవి రెండూ కుటుంబ పార్టీలని విమర్శించారు. గత సీఎం చంద్రబాబు పదే పదే ఢిల్లీకి వచ్చి తెచ్చుకున్న నిధుల్లో భారీగా అవినీతి జరిగిందని, వాటికి లెక్కలు చూపలేదని, ప్రస్తుత సీఎం జగన్ నాటి టీడీపీ అక్రమాలను తవ్వి తీసి ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. 

కాగా పౌరసత్వ సవరణ చట్టంపై కడపలో జనవరి 4వ తేదీ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, జాతీయ నేత జేపీ నడ్డా హాజరవనున్నారని దియోధర్ తెలిపారు.