సీఏఏపై ఆందోళన చేస్తున్న వారు దళిత్ వ్యతిరేకులే 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళన చేస్తున్న వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. వారిని దళిత వ్యతిరేకులుగా అభివర్ణించారు. మైనారిటీలను వారు తప్పుతోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ చట్టం వల్ల 70 నుంచి 80 శాతం మంది ప్రజలకు మేలు కలుగుతుందని, ముఖ్యంగా దళితులు లాభపడతారని ఆయన తెలిపారు. అయితే, దళితులంటే గిట్టని వారు సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని పరిరక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని, అయితే, కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఆయనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

‘సీఏఏ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటున్న దళిత నేతలను నిలదీయాలి. దీని వల్ల దళితులకు మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అని ప్రశ్నించాలి. వారి నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయాలి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారి హక్కులకు భంగం వాటిల్లదని నడ్డా భరోసా ఇచఃరు. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లపై అత్యాచారాలు, అమానుష దాడులు పెచ్చరిల్లుతున్నాయని గుర్తుచేశారు. ఈ కారణంగానే వారు భారత దేశానికి వస్తున్నారని, వారిని ఆదుకోవడం మన ధర్మమని నడ్డా చెప్పారు. అందుకే, ఈ విధంగా వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, దీనివల్ల దేశ పౌరులు ఎవరికీ, ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. 

మైనారిటీలను కొంత మంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకొని, సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పారు.