వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే తెరపైకి కెటీఆర్‌

రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ఫామ్‌ ‌హౌస్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్‌పై ప్రజలలో పెరిగిపోతున్న ఆగ్రహం,వ్యతిరేకత కారణంగానే కాబోయే సీఎం కేటీఆర్‌ అం‌టూ ఆయన అనుచరులతో ప్రకటనలు ఇప్పిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ‌ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ ఒం‌టెద్దు పోకడలు, అహంకార ధోరణిని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. 

ఇంటర్‌ ‌ఫలితాలలో అవకతవకలు, ఆర్టీసీ సమ్మె, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అన్ని అంశాలలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికే కేటీఆర్‌ను తెరపైకి తీసుకొస్తున్నారనిఆరోపించారు. 

టీఆర్‌ఎస్‌ ‌నేతల వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనీ, ఒవైపు కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడిగే వారిని ప్రజలు ఆదరించరని ఓ మంత్రి అంటుంటే మరోవైపు ముస్లిం అనే పదం లేదు కాబట్టే పార్లమెంటులో సీఏఏను వ్యతిరేకించామని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ అం‌టున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ‌సెక్యులర్‌ ‌పార్టీ అని చెప్పుకోవడం నేతిబీరకాయలో నెయ్యి అనే చందంగా ఉందని దుయ్యబట్టారు. 

పౌరసత్వ చట్టం 2019లో ముస్లిం అనే పదం లేకపోవడంతోనే వ్యతిరేకించామన్న అంశాన్ని ప్రధానంగా పెట్టి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అడిగే దమ్ము టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఉందా అని సవాల్ చేశారు. ముస్లిం అనే పదంతో పాటు కొన్ని షరతులు ఉన్నాయని వ్యాఖ్యానించిన కేటీఆర్‌ అవేంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. 

కాగా, త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ కోర్‌ కమిటీ పిలుపునిచ్చింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కోర్‌కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు పనిచేయాలని సమావేశం నిర్ణయించింది.

ప్రతి పార్లమెంటు పరిధిలో మున్సిపల్‌ ఎలక్షన్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించింది.అలాగే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమావేశం తప్పుబట్టింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మీద పెట్టిన కేసులను, పోలీసుల పక్షపాత వైఖరిని సమావేశం ఖండించింది.