పౌరసత్వ చట్టానికి మద్దతుగా బిజెపి భారీ ప్రచారం 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నది. జనవరి  5 నుంచి 15 వరకు ఈ చట్టానికి మద్దతు కూడగట్టేందుకు భారీ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ చట్టంపై ప్రజలకుగల అపోహలను తొలగించి, సరైన రీతిలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. 

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జే పీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ అగ్ర నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ చట్టానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా సుమారు 3 కోట్ల కుటుంబాలకు చేరువయ్యేందుకు బీజేపీ  ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా సుమారు కోటి మందికి చేరువై, ఈ చట్టం పట్ల అవగాహన కల్పించబోతున్నట్లు సమాచారం.

బౌద్ధులు, దళితులు, మైనారిటీలకు ఈ ప్రచార కార్యక్రమాలు చేరువయ్యే విధంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జే పీ నడ్డా, మరో 50 మంది అగ్ర నేతలు ఈ అవగాహన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తారు. వివిధ నగరాల్లో భారీ కార్యక్రమాలను నిర్వహించి పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

ఈ దశ పూర్తయిన తర్వాత ఏకంగా ఓ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ముస్లింలకు ఉన్న అపోహలను తొలగించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా బీజేపీ కృషి చేస్తోంది.