‘‘ఐదేళ్ళలో ఢిల్లీ గతి తప్పింది, ఇక కేజ్రీవాల్ అక్కర్లేదు’’  

‘‘ఐదేళ్ళలో ఢిల్లీ గతి తప్పింది, ఇక కేజ్రీవాల్ అక్కర్లేదు’’ అనే నినాదంతో త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి బిజెపి సమాయత్తం అవుతున్నది. . కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ‘‘ఐదేళ్లు బాగా గడిచాయి, మాతోనే ఉండు కేజ్రీవాల్’’ అనే నినాదాన్ని తిప్పి కొడుతూ బీజేపీ ఈ నినాదం ఇచ్చింది. 

ఢిల్లీ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా నినాదాలు రూపొందించాయి.

 కొత్త నినాదంతో కూడిన ఓ పోస్టర్‌ను ఢిల్లీ బీజేపీ ట్వీట్ చేసింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం కోసం కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయడంలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కేజ్రీవాల్ బొమ్మపై అబద్ధం అని రాసింది. 

విద్యా రంగం కోసం బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల గురించి కేజ్రీవాల్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని పేర్కొంది. 2014-15లో కేటాయించిన బడ్జెట్‌లో ఖర్చు చేసినది కేవలం 62 శాతమని, 2015-16లో 57 శాతం మాత్రమే ఖర్చు చేసిందని, 2016-17లో 79 శాతం ఖర్చు చేశారని బీజేపీ తెలిపింది.

ఢిల్లీ ఓటర్ల మనసు దోచుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇటీవలే అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించింది. కేజ్రీవాల్ కూడా ఉచిత వైఫై, మహిళలకు ఉచిత ప్రయాణాలు వంటి తాయిలాలు ఇస్తున్నారు.

70 స్థానాలున్న ఢిల్లీ శాసన సభకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2015 ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలను, బీజేపీ 3 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.