టిటిడి గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు  

గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును నియమిస్తూ టిటిడి పాలక మండలం కీలక నిర్ణయం తీసుకున్నది. చంద్రబాబునాయుడు హయాంలో వంశపారంపర అర్చకుల నియామకాన్ని రద్దు చేయడంతో పదవి కోల్పోయిన ఆయన టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తిరుమల  పవిత్రతను మంటగురువుతున్నారని అంటూ పెను దుమారం రేపడం తెలిసిందే. 

 ఆ నాడు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీతో చేతులు కలిపిన ఆయనకు జగన్ సీఎం ముఖ్యమంత్రి అయిన ఏడు నెలలకు కీలకమైన ఈ పదవి లభించినది.  రెండు నెలల క్రితం ఆయన సలహాదారునిగా నియమితులయ్యారు. 

అయితే రమణ దీక్షితులు నియామకం పట్ల ప్రస్తుతపు ప్రధాన అర్చకులు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలసి అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వారి విధుల నిర్వహణలో ఏ మాత్రం జోక్యం చేసుకోబోరని, మీ పని మీరు చేసుకోండని అంటూ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. 

కాగా, టిటిడి  ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టిటిడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది. 

సోషల్‌ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారు.   సోషల్ మీడియాలో  టిటిడి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వచ్చిన పోస్ట్ లపై న్యాయపర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిరుమల బర్డ్ డైరెక్టర్‌గా మదన్ మోహన్ రెడ్డి నియామిస్తున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించారు. 

 2019-20 వార్షిక బడ్జెట్‌ కింద రూ. 3243 కోట్లకు పాలకమండలి ఆమోదం తెలిపిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఘాట్‌ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10 కోట్లు, టీటీడీ పరిపాలనా భవనం మరమత్తుల కోసం రూ.14.30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ‘ఘాట్‌రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 

రూ.30 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి, జమ్ముకశ్మీర్‌, వారణాసిలోనూ ఆలయాలు నిర్శాణంకు నిర్ణయించారు.   2019-20 శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు ఆదాయం సమకూరింది’ అని తెలిపారు.

వైకుంఠ ఏకాదశి రోజున రెండు రోజుల పాటు... భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. తిరుపతిలోని కళ్యాణమండపాల్లో ఏసీ ఏర్పాటుకు 3.4 కోట్లు, పరిపాలన భవనం మరమ్మతులకు రూ.14.5 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.