కాంగ్రెస్ లో చేరిన కొండా సురేఖ దంపతులు

అసెంబ్లీ రద్దు సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన 105గురు పార్టీ అభ్యర్ధుల జాబితాలో తన పేరు లేకపోవడంతో సుమారు మూడు వారాలుగా అధికార పక్షం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తిరిగి కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి టి ఆర్ ఎస్ లో చేరిన ఆమె, ఆ పార్టీ తరపున శాసన సభకు ఎన్నికైనా మంత్రి పదవి రాకపోవడంతో అసంత్రుప్తిగానే ఉంటూ వచ్చారు.

కాంగ్రెస్ లో చేరడానికి ఒక రోజు ముందు హైదరాబాద్ లో పది పేజీల బహిరంగ లేఖను కెసిఆర్ ఉద్దేశించి విడుదల చేస్తూ  తెలంగాణ ఉద్యమకారులను ఏమాత్రం పట్టించు కోకుండా కెసిఆర్ కుల రాజకీయాలు చేశారని కొండా దంపతులు ద్వజమెత్తారు. క్యాంప్‌ఆఫీసు, ఫాంహౌసుకు కేసీఆర్ పాలన పరిమితమైందని, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపొయినదని విమర్శలు కురిపించారు..

ప్రభుత్వాన్ని ఎప్పుడైతే రద్దు చేసి ముందస్తుకు వెళ్లారో అప్పుడే ప్రజల్లో టీఆర్‌ఎస్ పై  వ్యతిరేకత వచ్చిందని కొండా సురేఖ విమర్శించారు. ఆత్మబలిదానాల మీద వచ్చిన తెలంగాణను అంధకారంలో నెట్టి .ఇపుడు తన కుమారుడు కేటీఆర్ చేతిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె ఫైర్ అయ్యారు.

ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని అంటూ లష్కర్ బోనాల్లో ఏహోదాలో కవిత బంగారు బోనం ఎత్తుకున్నారని ప్రశ్నించారు. మాతంగి, జోగిని శ్యామల శాపనార్ధాలు కేసీఆర్ ప్రభుత్వానికి తప్పక తగులుతాయని ఆమె తీవ్రంగా మండిప డ్డారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని తన పార్టీలోకి చేర్చుకుని కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు

కేసీఆర్ ప్రకటించిన 105 మంది పేర్లలో తన పేరు లేకపోవడం పట్ల కొండా సురేఖ ఫైర్ అయ్యారు. 105 మందిలో తన పేరు ప్రకటించనంత తక్కువ అయ్యానా అని ప్రశ్నించారు. తనకు టికెట్ రాకుండా చేసి కేసీఆర్ అవమానించారని అంటూ ఇక ఆ పార్టీలో తాను, తన భర్త ఉండబోమని తేల్చి చెప్పారు. 

తనకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు చెప్పాలని, సర్వే రిపోర్టు వివరాలను బయటపెట్టాలని 12 రోజుల క్రితమే ప్రశ్నించానని గుర్తు చేసారు. తన ప్రశ్నకు ఇంతవరకు టీఆర్‌ఎస్ సమాధానం ఇవ్వలేదని సురేఖ మండిపడ్డారు. పైగా తనపై విమర్శలు చేస్తూ తాము 2, 3 సీట్లు అడిగామని బద్నాం చేసే ప్రయత్నం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు తాముగా పార్టీ నుంచి బయటకు రాలేదని, వాళ్లే పంపించారని, అందుకే బయటకు వచ్చామని కొండా సురేఖ స్పష్టం చేశారు.  తమకు 15 పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని చెబుతూ రేపే మాపో భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని పేర్కొన్నారు.