సంక్రాంత్రి తర్వాతనే రాజధాని మార్పుపై ప్రకటన!

రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చే విషయంలో అందరూ ఎదురు చూస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై చెలరేగిన ఆందోళనలు, అసంతృప్తి సద్దుమణిగే వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి   భావిస్తున్నట్లు తెలిసింది. అందుకనే సంక్రాంత్రి తర్వాతనే ఈ విషయమై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపినట్లు చెబుతున్నారు. 

ప్రస్తుతానికి రాజధాని విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నుండి రావలసి ఉన్నందున ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు.  అయితే, ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని, అందుకు రాష్త్ర ఆర్ధిక పరిస్థితి అనుమతించాడని మాత్రం ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టం చేశారు. 

లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా హైదరాబాద్‌ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని సీఎం చెప్పారు.  ఈలోగా రాజధాని ఏర్పాటులో గతంలో టిడిపి పాలకులపై తమకు దీర్ఘకాలికంగా చేస్తున్న ఆరోపణలపై చర్యలను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా  ఇన్నాళ్లూ తాము చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై మంత్రివర్గం ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించిన మంత్రివర్గం ఉన్నత స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

ఏసీబీ, విజిలెన్స్‌, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదిక సిద్దం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. పైగా, రాజధాని మార్పులో న్యాయపరంగా చిక్కులు ఎదురు కాకుండా నిపుణులతో సమాలోచనలు జరపడానికి కూడా సిద్దపడుతున్నారు.