రాబర్ట్‌వాద్రాకు కాంట్రాక్టు ఇవ్వనందునే రాఫెల్ ఆరోపణలు

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రాకు యుద్ధవిమానాల కాంట్రాక్టు ఇవ్వకపోవటం వలనే రాఫెల్ డీల్‌లో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌పార్టీలేనిపోని ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసారు. అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ పార్టీలన్ని కలిసి యుద్ధవిమానాల కొనుగోళ్ళలోభారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్రమోదీపై బురదజల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఒంగోలులో మాట్లాడుతూ మండిపడ్డారు.  వాటిని ప్రజలు గమనించి తగిన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

2014 వరకు భారతదేశ రక్షణను యూపీఏ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కన్నా ధ్వజమెత్తారు. 2012లో యూపీఏ హయాంలో దసాల్ట్ కంపెనీకి ఒక్కొక్క విమానానికి రూ 700 కోట్లు చొప్పున అనుమతులు ఇచ్చి కొనుగోలు చేయలేదని గుర్తు చేసారు. తమ హయాంలో రూ 1173 కోట్లతో ఒక్కొక్కవిమానాన్ని కొనుగోలు చేసేందుకు హెచ్‌ఎఎల్ కంపెనీతోపాటు, మరో 72 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.

 అయితే యుద్ధ విమానాలకు సంబంధించి నాగపూర్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయటంతోపాటు టెక్నాలజీతో కూడిన విమానాలను కొనుగోలు చేస్తున్నామని, అందులో భాగంగా మిస్సయల్స్, విడిభాగాలు, సామగ్రి తదితర భాగాలను కొనుగోలు చేసేందుకు టెండర్లు పెంచామని వివరించారు.

యూపీఏ హయాంలో కేవలం విమానాల కొనుగోలుకే ధరలు నిర్ణయించారని, తాము విడిభాగాలకు, యూనిట్‌ను నెలకొల్పేందుకు పెంచాల్సివచ్చిందే తప్ప ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని స్పష్టం చేసారు. రాఫెల్ కుంభకోణంపై కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ రాహుల్‌గాంధీకి 15ప్రశ్నలు సంధించారని చెబుతూ దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేసారు. కాంగ్రెస్‌పార్టీతో జతకట్టిన తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమపార్టీపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసారు.

చంద్రబాబులాంటి అవినీతిపరుడు భారతదేశంలో మరొకరు లేరని విమర్శించారు. సొంత మామకే వెన్నుపొటుపొడిచిన ఆయన ఎవరినైనా సునాయాసంగా వెన్నుపోటుపొడుస్తారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర ఐటి శాఖమంత్రి నారా లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి ఉద్యోగాన్ని అవుట్‌ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టర్లను పెట్టి వందల కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారని పేర్కొంటూ  దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కడపలో స్టీల్ ప్లాంట్, ప్రకాశం జిల్లా రామాయపట్నం మేజర్‌పోర్టు రావటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదని కన్నా ద్వజమెత్తారు. మేజర్‌పోర్టుపై ప్రజా ఉద్యమాన్ని చేపడ్తామని ప్రకటించారు. వచ్చేనెల నుండి రాష్టవ్య్రాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.