ఓవైసీ, కేసీఆర్‌లు దేశంపై దాడి చేస్తున్నరు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నది బీజేపీపై యుద్ధభేరి కాదని, వారు చేస్తున్నది భారత ప్రజాస్వామ్యంపై దాడి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా కె  లక్ష్మణ్ దుయ్యబట్టారు.  దీనిని భారత సమాజం తిప్పికొడుతుందని స్పష్టం చేసారు.  దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ  చాకచక్యంగా పరిష్కరిస్తుండడంతో దేశ ప్రజలు మోడీకి జేజేలు పలుకుతూ.. బీజేపీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు. 

అది ఓర్వలేకే అభద్రతాభావానికి గురైన కొన్ని రాజకీయపక్షాలు అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆ రాజకీయ పక్షాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, దాని మిత్రపక్షం ఎంఐఎం కూడా ఉన్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక రాష్ట్రంలో చేపట్టకూడదని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రిని కోరాడని, అందుకు సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా  స్పందించారని లక్ష్మణ్ తెలిపారు. 

పార్లమెంటులో చేసిన చట్టాన్ని తెలంగాణలో అమలు చేయమనడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. అఖిల భారత ముస్లిం కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రికి చెప్పగా.. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని సీఎం కోరడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

లక్ష్మణ్. దేశాన్ని రెండు వర్గాలుగా విభజించాలన్న విషపూరిత ఆలోచన కేసీఆర్ లో ఉందని ఈ విషయం ద్వారా స్పష్టమవుతుందని లక్ష్మణ్ విమర్శించారు.  పౌరసత్వ సవరణ చట్టంలో దేశ పౌరులకు ఏ విధమైన ఇబ్బంది లేకున్నా.. పాతబస్తీలో ముస్లిం ఓటుబ్యాంకును పదిలం చేసుకునేందుకు అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తుంటే కేసీఆర్ ఆయనకు వంతపాడుతున్నారని నిప్పులు చెరిగారు.