బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ సిఎం అభ్యర్ధిగా కృష్ణయ్య

గత ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెలుగు దేశం పార్టీ ప్రకటించి, ఎమ్యెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన ప్రముఖ బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్యపై ఇప్పుడు సిపిఎం ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ కన్ను పడింది. తమను తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫ్రంట్ కన్వీనర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభ్రదం ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పటిది కాదని బీఎల్‌ఎఫ్ ఏర్పాటు చేసిన మరుసటి రోజునే నాయకత్వం వహించాల్సిందిగా కృష్ణయ్యను కోరినట్టు ఆయన తెలిపారు.

ఏ నిర్ణయం తీసుకునేది కృష్ణయ్య చేతిలోనే ఉందని వీరభద్రం చెప్పారు. గత వారమే తాము బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని, 60 సీట్లు బిసిలకే ఇస్తామని ప్రకటించారు. అయితే రాస్త్రంలో సిపిఎం నాయకత్వం రెండు అగ్రకులాలకే చిరకాలంగా పరిమితమై ఉండగా, ఎట్లాగు గెలిచే అవకాశం లేని ముఖ్యమంత్రి పదవిని బిసిలకు కట్టబెడతామని చెప్పడం వారిని మభ్యపరచి నాలుగు సీట్లు గెల్చుకొనే ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలసి జనసేన పార్టీతో కూటమిగా ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ మాత్రం రెండు పార్టీలు ఎవ్వరి దారి వారిదిగా ఉంటున్నది. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ కలసి ఏర్పాటు చేసిన మహాకూటమిలో చేరమని ఆహ్వానించినా సిపిఎం తిరస్కరించింది. దానితో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా కెసిఆర్ కు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇలా ఉండగా తెలంగాణలో ఉన్న 112 బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సమావేశంలో కుడా బీసీ సంఘాలన్నీ ఆర్ కృష్ణయ్య పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాయి. ఈ మేరకు ఆ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెల 27వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. 2014 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కృష్ణయ్య గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటూనే జాతీయ బీసీ కులాల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.