సీఎం మారితే రాజధాని మారడమా!  

‘‘అమరావతి రైతుల సమస్య కాదు, రాజధాని సమస్య. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారిస్తే రాష్ట్రం మీద నమ్మకాలు పోతాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇస్తే కేంద్రం నిధులు ఇచ్చింది. చంద్రబాబు, జగన్‌ను చూసి ఇవ్వలేదు. సీఎం మారితే రాజధాని మారడం ఇంత వరకూ చరిత్రలో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి తన అపరిపక్వతతో అటువంటి పిచ్చిపనికి పూనుకుంటున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 

తమకు న్యాయం చేయాలని, తమ బాధ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో చెప్పుకునే అవకాశం కల్పించాలని రాజధాని గ్రామాల రైతులు మంగళవారం గుంటూరులో కన్నాను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంది కాని, పరిపాలన వికేంద్రీకరణ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆరు నెలల నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల మాట ఏమో కాని ఎవ్వరికీ నిద్ర లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కిందని ధ్వజమెత్తారు. 

లక్షల ఉద్యోగాలు అని చెబుతూ రెట్టింపు మందిని రోడ్డున వేశారని మండిపడ్డారు. కక్ష సాధింపు, అనుభవ రాహిత్యం, అపరిపక్వత కలిసిన ముఖ్యమంత్రి పాలనలో ఈ రాష్ట్రం దశ, దిశ లేని విధంగా మారిందని  చేశారు. అధికారంలో ఉన్న మంత్రులు బాధ్యతతో వ్యాఖ్యలు చేయాలని కన్నా  హితవు చెప్పారు. శ్మశానమని, ఎడారి అని, వరదలు వస్తే మునిగిపోతాయని... ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయన్న కనీస ఇంగితం కూడా లేకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. 

తమ పార్టీ తరఫున రాజధాని రైతులకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని కన్నా ప్రకటించారు. ‘రాజధాని నిర్మాణం కోసం రూ.10 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటామంటే ఇక్కడ ఎవరూ చూస్తూ కూర్చోరు. ఇదేమి సొంత కంపెనీ కాదు’’ అంటూ కన్నా స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధానిని మారిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కక్షపూరిత ధొరణితో వ్యవహరించటం సరికాదని ఆయన హితవు పలికారు.