ఎంత బురద చల్లితే.. కమలం అంత వికసిస్తుంది

ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నదని.. వారు ఎంత బురద చల్లితే కమలం అంత వికసిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అభివృద్ధిపై చర్చించటం కన్నా బురదచల్లటమే కాంగ్రెస్‌కు సులువైన పని అని ఆయన దయ్యబట్టారు.  మధ్యప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ భోపాల్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న రాఫెల్ ఆరోపణలపై స్పందించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోపల ఒక బలమయిన కూటమిని ఏర్పాటు చేయడంలో విఫలమయిన కాంగ్రెస్ పార్టీ దేశం వెలుపల నుంచి మద్దతు పొందడానికి చూస్తోందని ఆరోపించారు

జెట్ గేట్ (రాఫెల్ కుంభకోణం)ను సరిగ్గా వాడుకుంటే, రాహుల్ భారత్‌కు తదుపరి ప్రధాని అవుతాడంటూ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహమాన్ మాలిక్ చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. అహంకార ధోరణే కాంగ్రెస్ పార్టీని 440 స్థానాల నుంచి 44 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యేలా చేసిందని విమర్శించారు. 125 ఏండ్ల పార్టీ అయిన కాంగ్రెస్‌లో ఇప్పుడేమీ మిగల్లేదని స్పష్టం చేసారు.

మైక్రోస్కోప్‌తో వెతికినా ఆ పార్టీలో ఏమీ కానరాదు అని మోదీ ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు చిన్నాచితకా పార్టీల మద్దతు కోసం దేబిరిస్తున్నదని అవహేళన చేసారు. ఒకవేళ ఏదైనా కూటమి ఏర్పడినా అది సఫలంకాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు ఆ విషయం తెలుసు కాబట్టే దేశం బయటి మద్దతుకోసం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. భారత్‌కు అవతల కూర్చున్న కొందరు.. ఈ దేశంలో ఎవరు ప్రధాని కావాలో నిర్ణయిస్తారట అని మోదీ పేర్కొన్నారు.

2001లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ నాపై ఆరోపణలు చేస్తున్నది. నన్ను తిట్టని తిట్టు లేదు. డిక్షనరీలోని పదాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు కూడా.. అభివృద్ధిపై చర్చించటం ఇష్టంలేదు కాబట్టి వారు బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారు అని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి భారంగా మారిందని చెప్పారు. ఇస్లామిక్ దేశాల్లోనూ ట్రిపుల్ తలాక్ దురాచారాన్ని అంగీకరించడం లేదని తెలిపిన మోదీ.. ఓ మహిళ (సోనియాగాంధీ) నేతృత్వంలోని పార్టీ మాత్రం ట్రిపుల్ తలాక్ బారినపడిన ముస్లిం సోదరీమణుల బాధలు ఏమాత్రం పట్టించుకోలేదు అని విమర్శించారు.