చైనాలో ఇరవై లక్షల మంది ముస్లింల నిర్బంధం

అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనాలోని ఉయ్‌గుర్ ముస్లింలతోపాటు ఇతర ముస్లిం మైనార్టీలకు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజలు సామూహిక నిర్బంధ శిబిరాల్లో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవహక్కుల కమిటీ బట్టబయలు చేసింది.ఈ శిబిరాలను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నట్టు కుడా తెలిపింది. చైనా ప్రభుత్వం చేస్తున్న ఈ దురాగతాలపై తమకు చాలా నివేదికలు అందాయని, ఇది అత్యంత విశ్వసనీయ సమాచారమని తెలిపింది.

జెనీవాలో మానవ హక్కుల సమావేశం సందర్భంగా చైనా వ్యవహారాలపై సమీక్ష తర్వాత ఐరాస జాతి వివక్ష నిర్మూలన కమిటీ సభ్యురాలైన గే మెక్‌డౌగల్ ఈ వివరాలను వెల్లడించారు. శిబిరాల్లో 20 లక్షల మంది ఉయ్‌గుర్, ఇతర ముస్లిం మైనార్టీలు మగ్గిపోతున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన పశ్చిమ జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఈ దురాగతాలు చోటుచేసుకుంటున్నాయి. మాకు అందిన అనేక విశ్వసనీయ నివేదికల సమాచారం గురించి చాలా ఆందోళన చెందుతున్నాం. మతపరమైన ఉగ్రవాదంపై పోరాటం, సామాజిక స్థిరత్వం నెలకొల్పడం అనే సాకులతో ఉయ్‌గుర్ ప్రజలు ఉండే ప్రాంతాన్ని సామూహిక నిర్బంధ సైద్ధాంతిక, రాజకీయ శిబిరంగా మార్చారు. ఇదంతా అత్యంత రహస్యంగా సాగుతున్నదని ఆమె పేర్కొన్నారు

ఈ ప్రాంతం ఒకరకంగా హక్కుల రహిత జోన్‌గా మారింది. ఉయ్‌గుర్, ఇతర ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలను కేవలం మతపరమైన గుర్తింపు ఆధారంగా చైనా శత్రువులుగా భావిస్తున్నది అని గే మెక్‌డౌగల్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈజిప్టు, టర్కీ తదితర దేశాల నుంచి చైనాకు వచ్చిన దాదాపు 100 మంది ఉయ్‌గుర్ జాతి విద్యార్థులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరిలో కొంతమంది నిర్బంధంలోనే ప్రాణాలు వదిలారు అని ప్రకటించారు.

కాగా, ఇదే కమిటీలో మరో సభ్యురాలైన ఫాతిమా బింట్టా దాహ్ చైనాలో ఉయ్‌గుర్ జాతి ప్రజలకు ప్రస్తుతం లభించే మతపరమైన స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉన్నది? వారు తమ మతపరమైన ఆచారాలను కొనసాగించడానికి చట్టపరంగా ఉన్న రక్షణలు ఏమిటి? అని చైనా ప్రతినిధి బృందాన్ని ప్రశ్నించారు. మరోవైపు టిబెటియన్ ప్రాంతంలో హక్కుల గురించి మరికొందరు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.