జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి జయకేతనం  

కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వ విజయంతో రెండోసారి అధికారానికి వచ్చిన బీజేపీకి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ అడ్డంకులు, అవరోధాలు తప్పలేదు. మరోపార్టీతో జతకట్టి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బీజేపీకి మహారాష్ట్రలో మాత్రం చుక్కెదురైంది. 

తాజాగా జార్ఖండ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు విరుద్ధంగా.. అధికార బీజేపీని ఖంగుతినిపించిన కాంగ్రెస్‌-జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీ కూటమి సంపూర్ణ మెజారిటీని సాధించిందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఐదు విడుతలలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. 

మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమికి 47 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారంలో ఉన్న బీజేపీకి 25 సీట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 12 స్థానాలను కోల్పోగా, జేఎంఎం కూటమి 22 స్థానాలను అదనంగా గెలుచుకుంది. మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీకి చెందిన జేవీఎంకు 3, ఏజేఎస్‌యూ 2, ఆర్జేడీ 1, ఎన్సీపీ 1, ఇతరులు 3 స్థానాలను గెలుచుకున్నారు. 

ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు ఆరుగురు, స్పీకర్‌ కూడా ఓటమి పాలయ్యారు. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, కూటమి సారథి హేమంత్‌ సొరేన్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించారు. ఆయన డుమ్కా స్థానంలో తన సమీప బీజేపీ ప్రత్యర్థి లూయిస్‌ మరాండీని 13వేల ఓట్ల తేడాతో ఓడించారు. 

జంషెడ్‌పూర్‌ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ రెబల్‌ అభ్యర్థి చేతిలో ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ దాస్‌ ఓటమి పాలయ్యారు. ఏడాది వ్యవధిలో బీజేపీ ఐదో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం బీజేపీ ముందంజలో ఉన్నది. మొత్తం పొలైన ఓట్లలో ఆ పార్టీకి 33.4 శాతం వచ్చాయి. జేఎంఎంకు 18.7, కాంగ్రెస్‌కు 13.9 , ఏజేఎస్‌యూకు 8.1% ఓట్లు వచ్చాయి.  

జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమికి సారథ్యం వహించిన హేమంత్‌ సొరేన్‌ (44) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రత్యేక జార్ఖండ్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన శిబుసొరేన్‌ కుమారుడే హేమంత్‌. శిబు మూడు పర్యాయాలు సీఎంగా పనిచేయగా, హేమంత్‌ 2013-14 మధ్య కాలంలో 17 నెలల పాటు రాష్ట్ర ఐదో సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అర్జున్‌ ముండా నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌లో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. 2009-10 మధ్య ఆరు నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.  

రామ్‌గఢ్‌ జిల్లాకు చెందిన హేమంత్‌ ఇంటర్మీడియట్‌ వరకే చదువుకున్నారు. బీఐటీ మెస్రాలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరిన హేమంత్‌ చదువును కొనసాగించలేకపోయారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.  ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి నేపథ్యంలో జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌ దాస్‌ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్మును కలిసిన సీఎం తన రాజీనామాను సమర్పించారు. అయితే తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ కేర్‌టేకర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ ఆయనను కోరారు.