రాజధానిపై చంద్రబాబు ట్రాప్ లో వైసిపి 

రాజధాని అంశంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్ లో వైసిపి ప్రభుత్వం పడుతున్నదని బిజెపి నేత, ఎమ్యెల్సీ సోము వీర్రాజు హెచ్చరించారు. రాజధాని కేంద్రంగా అభివృద్ధి జరిగిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. రాజధాని అనే మైథాలజీకి చంద్రబాబు నిర్మాతగా ఉన్నారని పేర్కొంటూ అసలు రాజధాని అనే దానిపై చర్చ అనవసరం అని హితవు చెప్పారు. రాజధాని అనేది సైలెంట్‌గా చేసుకోవాల్సిన పని అని తెలిపారు. 

ప్రజలకు కావాల్సింది అభివృద్ధి... అది వికేంద్రీకరణతోనే సాధ్యమని పేర్కొన్నారు. అమెరికా రాజధాని ఓ పల్లెటూరులో ఉంది. చైనా రాజధాని బీజింగ్‌... కానీ అభివృద్ధి షాంఘైలో జరిగింది. భారతదేశంలో అనేక రాష్ట్రాలు విడిపోయాయి. అవన్నీ తమ రాజధానులను సైలెంట్‌గా నిర్మించుకున్నాయిని వివరించారు.

 ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజధానిపై చర్చను పెంచకుండా అన్ని ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని ఆయన  సూచించారు. రాజధాని అంటే భూములు కొనుక్కోవడం కాదని ఎద్దేవా చేశారు. ఎవరినో సీఎంను చేయడానికి రాజకీయ పార్టీ ఉండకూడదని, అభివృద్ధి కోసమే ఉండాలని సోము స్పష్టం చేశారు. 

రాయలసీమను అభివృద్ధి చేస్తే ఎవరో ఏదో అనుకుంటారని భావించాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. బంగారంతోపాటు ఎన్నో విలువైన ఖనిజాలు ఉన్న రాయలసీమను రత్నాల సీమగా అభివృద్ధి చేయాలని సూచించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలంలోనే నెల్లూరు పోర్టు వచ్చిందనీ, పోలవరంను ప్రారంభించిందీ ఆయనేనని గుర్తు చేశాన్నారు. 

వైఎస్‌ కాలంలో తవ్విన రెండు కాలవల్లో బోర్లు వేసి ఎత్తిపోతల పథకం అంటున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 900 కిలోమీటర్ల తీరమున్నా చంద్రబాబు ఒక్క పోర్టూ కట్టలేదని ధ్వజమెత్తారు. కడితే తమ వారికి ఉన్న పోర్టుకు ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఉంటారంటూ విమర్శించారు. 

కాగా, భారత్‌లో ముస్లింలను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని, క్యాబ్‌ బిల్లుపై మైనారిటీలకు భయమెందుకని అని వీర్రాజుప్రశ్నించారు.