ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న కుమార స్వామి  

పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలోని ఏ వర్గానికి ఇబ్బంది లేదని అయినా ముస్లింలను దారి తప్పించేందుకు కుమారస్వామి కుట్ర పన్నారని సీఎం యడియూరప్ప ఆరోపించారు. ఆదివారం కుమారస్వామి మంగళూరును సందర్శించి పోలీసు కాల్పులలో మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం పలు ఆరోపణలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంగళూరులో అల్లర్లు తీవ్రతరం అయ్యేందుకు స్థానికేతరులే కారణమని ధ్వజమెత్తారు. పోలీసులపై రాళ్ళు రువ్వినవారు స్థానికులు కాదని, పోలీస్‌ స్టేషన్‌లో ఆయుధాల గదిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. కేరళ వాసులకు మంగళూరు గొడవలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కుమారస్వామి రెచ్చగొట్టేలా కేరళ వా సులు రాకూడదా..? అనడం వెనుక అర్థం ఏమిటని నిలదీశారు. 

సిఎఎ, ఎన్‌ఆర్‌సి ఉద్దేశ్యాలను సిద్దరామయ్య, కుమారస్వామిలు ప్రజలకు తొలుత వివరించాలని ఆ తర్వాత చట్టం గురించి తెలుసుకోవాలని హితవు చెప్పారు. హింసను ప్రేరేపించడమే వ్యూహంగా వ్యవహరించడం సరికాదన్నారు. మంగళూరులో ముస్లిం మత పెద్దలు, ధర్మ గురువులతో చర్చించానని, ఎవరూ చట్టాన్ని వ్యతిరేకించి మాట్లాడలేదని పేర్కొన్నారు. 

సిఎఎతో ముస్లింలకు నష్టం లేదని భరోసా ఇచ్ఛారు. యడియూరప్ప ఎంత కాలం సీఎంగా ఉంటారో చూస్తానంటూ కుమారస్వామి సవాల్‌ సమంజసమేనా..? అని ప్రశ్నించారు. 

మరో మూడున్నరేళ్ళు తానే ముఖ్యమంత్రి అని భరోసా వ్యక్తం చేస్తూ ఉప ఎన్నికలతోనే జేడీఎస్‌ అడ్రస్‌ లేకుండా పోయిందని యడియూరప్ప గుర్తు చేశారు. మూడేళ్ళ తర్వాత ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. మంగళూరులో పోలీసు కాల్పులలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు.