ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌తో కెసిఆర్ కలిసినా ఆశ్చర్యం లేదు

టీఆర్‌ఎస్‌, బిజెపి జాతీయ నాయకత్వం మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ బిజెపి అద్యక్షుడు డా. కె లక్ష్మణ్ స్పష్టం చేసారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో కుడా బరిలోకి దిగుతామని చెబుతూ 20 రాష్ట్రాల్లో గెలిచాం. తెలంగాణలోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నాం అని పేర్కొన్నారు. రెండు శాతం ఓట్లు లేని త్రిపురలో, నలుగురు ఎమ్మెల్యేలున్న హరియాణాలో అధికారంలోకి వచ్చామని చెప్పారు.

బిజెపికి టీఆర్‌ఎస్‌ దగ్గరని కాంగ్రెస్‌.. కేంద్రం రాష్ట్రాన్ని విస్మరించిందని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తూ మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయని లక్ష్మణ్ విమర్శించారు.  కర్ణాటకలో కాంగ్రెస్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుమారస్వామికి సూచించిన కేసీఆర్‌ తెలంగాణలో ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌తో కలిసినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కాకుండా జాతీయ స్థాయిలో కూటములు కడుతున్నారని అంటూ బిజెపిని వ్యతిరేకించే మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌ అంటకాగుతోందని గుర్తు చేసారు.

టీఆర్‌ఎస్‌ కు ఓ విధానం అంటూ లేని, నిర్మాణం లేని నీటిబుడగ పార్టీ అని లక్ష్మణ్ కొట్టిపారవేసారు. తాము పంచిన గొర్రెలు, బర్రెలు ఎన్నికల్లో గెలిపిస్తాయని భ్రమిస్తోందని చెబుతూ తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరని స్పష్టం చేసారు. మీరిచ్చే తాయిలాలకు ఆశపడి ఓటేస్తారనుకుంటే పగటికలే అని అధికార పక్షానికి చురకలు అంటించారు.

ఇంటికో ఉద్యోగం.. కేజీ- పీజీ ఉచిత విద్య, ఇల్లులేని వారికి రెండు పడకగదుల ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, కోటి ఎకరాల భూమి సాగు.. ఇలా ఏ హామీని కుడా టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని లక్ష్మణ్ గుర్తు చేసారు. టీఆర్‌ఎస్‌ మోసాలు, వైఫల్యాలే తమ ప్రధాన ప్రచారాస్త్రాలని చెప్పారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ.. రాష్ట్రంలో అవినీతి, టీఆర్‌ఎస్‌ కుటుంబపాలనను ప్రజల్లోకి తీసుకెళతామని,  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా మేనిఫెస్టోను తయారుచేస్తున్నామని పేర్కొన్నారు.

అక్టోబరు తొలి వారంలో కరీంనగర్‌, ఆ తర్వాత వరంగల్‌తో పాటు తెలంగాణలో మరోచోట- మొత్తం మూడు బహిరంగసభల్లో అమిత్‌షా పాల్గొంటారని, ఆ తర్వాత మోదీ ప్రచారం మొదలవుతుందని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ, జావడేకర్‌, స్మృతిఇరానీ ప్రచారానికి వస్తారని చెబుతూ రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సమ్మేళనాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణను కాషాయమయం చేయాలన్న సంకల్పం పరిపూర్ణనంద స్వామికి ఉందని పేర్కొంటూ  బిజెపి తరఫున ఆయన ప్రచారం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం ఆయనదే అని చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఒవైసీ సోదరులను వదిలేసి పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేశారని అంటూ ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని హెచ్చరించారు. స్వామిజీలు, తటస్థులు బయటకు రావాలని, ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందో చెబుతూ ప్రజల్ని చైతన్యపరచాలని పిలుపిచ్చారు.  

పార్టీ శ్రేణులతో, సంస్థలతో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నామని చెబుతూ  తెలంగాణలో 60 శాతం ప్రజలు ప్రధాని మోదీకి మద్దతు పలికినట్లు తేలిందని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి ఉమ్మడి ఏపీలో 23 శాతం ఓట్లు, 7 ఎంపీ సీట్లు సాధించిన చరిత్ర బిజెపికి ఉందని గుర్తు చేసారు. ప్రస్తుతం ప్రజల నాడి బిజెపికి అనుకూలంగా ఉందని,  కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ధనబలాన్ని ఎదుర్కొని నిలబడతామని ధీమా వ్యక్తం చేసారు.