పౌరసత్వంపై వెయ్యి ర్యాలీలు జరుపనున్న బిజెపి 

పౌరసత్వ చట్టంపై అపోహలు నివృత్తి చేసేందుకు, వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా 1000 ర్యాలీలను, 250 మీడియా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందికేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. 

ఈ నేపథ్యంలో సీఏఏపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో అధికార పక్షం నేతలు శనివారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించగా.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.

సీఏఏ గురించి ప్రజలకు వివరించేందుకు దేశ వ్యాప్తంగా ఆ చట్టంపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే 10 రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 250 మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 1000 ర్యాలీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

‘విపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తాం. వివిధ వర్గాల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిస్తాం. కాంగ్రె్‌సతో పాటు కొన్ని పార్టీలు చెబుతున్న అబద్ధాలను, దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు చేస్తున్న యత్నాలను బట్టబయలు చేస్తాం’ అని భూపేందర్‌ చెప్పారు.  

సుమారు మూడు కోట్ల కుటుంబాలను కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై వారికున్న అపోహలను తొలగిస్తామన్నారు. సీఏఏ వల్ల భారత పౌరులకు ఎటువంటి నష్టం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టాన్ని బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.