రేపుగులాబీ గడీలూ కూలతాయ్‌....డా. లక్ష్మణ్

నరేంద్ర మోదీ దెబ్బకు దేశంలో కాంగ్రెస్‌ కంచుకోటలు కూలిపోయాయి. వామపక్షాల ఎర్రకోటలు బద్దలయ్యాయి. రేపుగులాబీ గడీలూ కూలతాయ్‌ అని ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేసారు.

నాలుగున్నరేళ్ల తెరాస పాలనతో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేశారు. ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగుల్ని నిర్బంధించారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా ప్రజల్ని బందీలను చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెదేపాలకు.. తెలంగాణ వచ్చాక తెరాసకు.. పాలించే అవకాశాలు వచ్చాయి. అయినా ప్రజల స్థితిగతులు మారలేదు. వాళ్లు మార్పు కోరుకుంటున్నారు. అది మాతోనే సాధ్యం. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరతాం’ అని ఆయన పేర్కొన్నారు.

నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని.. అవినీతి, నిరంకుశ, వారసత్వ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని లక్ష్మణ్‌ విమర్శించారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా నిరంకుశంగా పాలించారని ధ్వజమెత్తారు. ఒకే దేశం -ఒకే ఎన్నికలన్న ప్రధాని మోదీకి మద్దతిచ్చి మాట తప్పిన కేసీఆర్‌.. ఎన్నికల హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారు.

మజ్లిస్‌తో   టి ఆర్ ఎస్, టిడిపితో కాంగ్రెస్‌ అపవిత్ర పొత్తులు పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండింటినీ ఒంటరిగా ఎదుర్కొని విజయం సాధించే సత్తా బిజెపికి  ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపి.. తెలంగాణ ఏర్పడ్డాక టి ఆర్ ఎస్ అవినీతి, వారసత్వ రాజకీయాలు చేశాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి సన్నద్ధత, వ్యూహాలపై పార్టీ వ్యూహాలపై లక్ష్మణ్‌ ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

లోక్‌సభకు, అసెంబ్లీకి జమిలే ఎన్నికలే వస్తాయని ఘంటాపథంగా చెప్పారు. మీ అంచనా ఎక్కడ తప్పింది? జాతీయ పార్టీ నుంచి సంకేతాలు అందలేదా?

మాట మార్చడంలో కేసీఆర్‌ దిట్ట. కుట్రపూరితంగా ముందస్తు ఎన్నికలు తెచ్చారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా కాకుండా అరికట్టొచ్చని ప్రధాని మోదీ ఒకే దేశం-ఒక ఎన్నికల అంశాన్ని తెస్తే.. మొట్టమొదట లిఖితపూర్వకంగా సమర్థించింది ఆయనే. అయితే, సర్వేల్లో దేశవ్యాప్తంగా 50 శాతం పైగా మద్దతు మోదీకి రావడం, ప్రత్యర్థులు దరిదాపుల్లోనూ లేకపోవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుంది. లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మా ముందు రాష్ట్రంలో టి ఆర్ ఎస్ నిలబడలేదని, నానాటికి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భయంతో జమిలిపై మాట తప్పారు. యూటర్న్‌ తీసుకున్నారు. ఉన్నఫళంగా అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత ఎన్నికలపై నిర్ణయాధికారం ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ముందస్తుపై అంచనా వేయలేకపోయాం.

అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్షాల మహాకూటమి.. ఈ రెండింటిని ఒంటరిగా ఎలా ఎదుర్కోబోతున్నారు?

బలంగా ఉన్నామని, ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ ముందస్తుకు ఎందుకు వెళుతోంది? మజ్లిస్‌తో ఎందుకు జట్టు కడుతోంది? కాంగ్రెస్‌ కూడా ఒంటరిగా గెలవలేమన్న భయంతోనే ఇతర పార్టీలతో కూటమికి సిద్ధమవుతోంది. బిజెపి మాత్రమే సింహంలా ఒంటరిగా బరిలోకి దిగుతుంది. వారసత్వ, కుటుంబ, అవినీతి రాజకీయాల్లో కాంగ్రెస్‌, తెరాస ఒకేగూటి పక్షులు. పాముకు పాలుపోసినట్లు టిడిపి, కాంగ్రెస్‌, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మజ్లిస్‌ను పెంచి పోషించాయి.

మోదీ సీఎంగా, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బిజెపి ముందస్తుకు వెళితే ఒప్పు..మేం వెళితే తప్పా? అని టీఆర్‌ఎస్‌ అంటోంది?

గతంలో ముందస్తు ఎన్నికల అంశం వచ్చినప్పుడు ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికల ప్రస్తావన లేదు. ఇప్పుడు ఒకే దేశం- ఒకే ఎన్నిక చర్చ నడుస్తోంది. దీనికి తొలుత స్పందించింది టీఆర్‌ఎస్‌ కాదా? కేటీఆర్‌ సమాధానం చెప్పాలి. డొంకతిరుగుడు మాటలు, ఎదురుదాడితో తప్పించుకోలేరు. ‘‘కేసీఆర్‌ బాహుబలి అని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. కానీ ఆ బాహుబలి కేసీఆర్‌ వెనుక గోతులు తవ్వడానికి కట్టప్పలు ఉన్నారు. వారెవరు అన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుంది. కాంగ్రెస్‌లోనూ చాలామంది కట్టప్పలు ఉన్నారు. బిజెపికి అన్ని అస్త్రాలకు మించిన బ్రహ్మస్త్రం మోదీ రూపంలో ఉంది. ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని సంధించి విజయం సాధిస్తాం’’.

బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదని, హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం మోసం చేసిందని.. విభజన హామీలు నెరవేర్చలేదని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు కదా?
ఎయిమ్స్‌, గిరిజన వర్సిటీ సహా 90 శాతం విభజన హామీలను కేంద్రం అమలు చేసింది. యూపీఏ హయాంలో 13వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ ప్రాంతానికి వచ్చిన నిధులు రూ.16 వేల కోట్లే. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ నిధులు రూ.1.25 లక్షల కోట్లకు పెరిగాయి. తెలంగాణ అభివృద్ధిపట్ల ఎన్డీయే చిత్తశుద్ధికిది నిదర్శనం. పెద్ద సంఖ్యలో జాతీయ రహదారుల మంజూరు, నిరంత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వర అనుమతుల్లో కేంద్రం ఎంతో సహకరించింది. నాణ్యమైన ఉక్కు లేదని తెలిసినా బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. చంద్రబాబుతో కేసీఆర్‌ లాలూచీ వల్లే హైకోర్టు విభజన ఆలస్యం అవుతోంది. అమరావతిలో భవనాల నిర్మాణం, సదుపాయాల కల్పన తర్వాతే విభజన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ రాజధానిలో హైకోర్టు భవనాల నిర్మాణంపై చంద్రబాబుపై కేసీఆర్‌ ఏనాడు ఒత్తిడి చేయకపోవడం వల్లే విభజన ఆలస్యమవుతోంది.