చంపేస్తామంటూ గౌతం గంభీర్‌కు బెదిరింపులు

బీజేపీ ఎంపీ, మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌, ఆయన కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ రావడంతో గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన శాహద్ర డీసీపీకి లేఖ రాశారు.

‘‘నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాను..’’ అని గంభీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు పరిణామాలపై కుండబద్దలు కొట్టినట్టు అభిప్రాయాలను వెల్లడించడం ఆయన ప్రత్యేకత.