వైఎస్సార్ నేతన్న నేస్తం ప్రారంభించిన సీఎం జగన్  

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించి వైఎస్సార్ చేనేత భరోసా చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థికసాయం అందనుంది.  అనంతపురంలో 27వేల 481 చేనేత కుటుంబాలను అధికారులు ఎంపిక చేశారు. మరోవైపు ఈ వేదికపైనే సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరుగనున్నాయి.  

ప్రతి చేనేత కార్మికుడికి మంచి జరిగే విధంగా ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.   ధర్మవరంలో నేతన్నల కష్టాలు తన కన్నా బాగా ఎవరికీ తెలీదన్నారు. నేతన్నలకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. అగ్గిపెట్టేలో పట్టే చీర దగ్గర నుంచి స్వాతంత్రోద్యమం వరకు నేతన్నలకు ఒక చరిత్ర ఉందని కొనియాడారు. 

ధర్మవరం చేనేతల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారని చెబుతూ చేనేతల ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలు పేదరికం, అప్పుల బాధతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆప్కో పేరుతో దోచుకుందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. 

ఐదేళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు నేరుగా అందిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ.3.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు. 

వచ్చే ఉగాది లోగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలకు ఇస్తామని హామీ ఇచ్ఛారు. జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15వేలు సాయం అందజేస్తామని చెప్పారు.