పాఠశాలలపై దేశద్రోహ కేసులు పెడతాం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పాఠశాలలు విద్యార్థులకు నూరిపోస్తోన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి పాఠశాలలపై దేశద్రోహ కేసులు పెడతామని బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. సీఏఏపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తుతూ సీఏఏను వ్యతిరేకిస్తున్నానని కేసీఆర్‌ పత్రికా ముఖంగా చెప్పగలరా? అంటూ సవాల్‌ విసిరారు. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్రమంగా ఉంటున్న ముస్లింలకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందా? అని నిలదీసిరు. దమ్ము, ధైర్యముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో యూనివర్సిటీలను, జీహెచ్‌ఎంసీ, అంగన్‌ వాడీ, సింగరేణి, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.  

మరోవైపు యూనియన్లను రద్దు చేయడం పట్ల కేసీఆర్‌పై మండిపడ్డారు. యూనివర్సిటీలు, జీహెచ్‌ఎంసీ, అంగన్‌వాడీ, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లతో కాకుండా కార్మికులతో కేసీఆర్‌ భేటీ అయ్యారని, ఇదే పద్ధతిలో కేంద్రం ముఖ్యమంత్రితో కాకుండా ఎమ్మెల్యేలతో మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 

యూనియన్ల రద్దు కుదరదని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కూడా ఒప్పుకున్నాడని గర్తు చేశారు. కార్మికులపై కేసీఆర్‌ వ్యతిరేక ధోరణిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.    

ఇలా ఉండగా, మతోన్మాద మజ్లిస్‌ పార్టీకి భయపడే పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఓటు వేసిందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, అర్బన్‌ నక్సలైట్లు, టీఆర్‌ఎస్, మజ్లిస్‌ కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై గందరగోళం సృష్టిస్తున్నాయని, ఆలోచన రహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 12 శాతం ఓట్ల కోసం సీఎం.. ఒవైసీకి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు.