రాజకీయాల కోసమే రాఫెల్‌పై కాంగ్రెస్ రాద్దాంతం

రాజకీయ ప్రయోజనాలను ఆశించే రాఫెల్‌పై కాంగ్రెస్ రాద్ధాంత చేస్తోందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండ్ వివరణ ఇచ్చినా కాంగ్రెస్ అదేపనిగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. హోలాండ్ వివరణతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ పనిగట్టుకుని ‘రాఫెల్’ను రాజకీయం చేస్తోందని హోం మంత్రి విరుచుకుపడ్డారు.‘ ప్రభుత్వాన్ని ఎత్తిచూపడానికి ప్రతిపక్షానికి ఏమీ కనిపించడం లేదు. రాఫెల్ ఒప్పందాన్ని సాకుగా చూపించి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటోంది’అని ఆయన దయ్యబట్టారు. ‘రాఫెల్ డీల్‌పై హోలాండ్ సవివరంగా చెప్పారు. అయినా ప్రతిపక్ష పార్టీ అదే పనిగా కేంద్రంపై విమర్శలు చేస్తోంది’అని చెప్పుకొచ్చారు.

కాగా, కాశ్మీర్ సమస్యపై ఎవరితోనైనా చర్చలకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ ప్రకటించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని పాకిస్తానేనని ఆయన విమర్శించారు. ‘జమ్మూకాశ్మీర్ సమస్యపై ఎవరితోనైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతాదళాలు సమష్టిగా, సమన్వయంతోనే పనిచేస్తున్నాయి’అని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదుల్లో కాశ్మీర్ లోయలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.