హైదరాబాద్ కు చేరుకున్నరాష్ట్రపతి కోవింద్  

శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, శాసనసభ సభాపతి, శాసనమండలి చైర్మన్, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, నగర మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి, శాలువతో సత్కరించారు. 

రాష్ట్రపతి ఈ నెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బసచేయనున్నారు. 22న తెలంగాణ రాష్ట్ర శాఖకు చెందిన రెడ్‌క్రాస్ సొసైటీ మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. పాండిచ్చేరి యూనివర్సిటీ స్నాతకోత్సవం నేపథ్యంలో ఈ నెల 23న పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడినుంచి 25న కన్యాకుమారికి వెళ్లి వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. 

ఈ నెల 27న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, అధికారులు, అకడమిక్స్ తదితరులతో ఆయన సమావేశం కానున్నట్టు రాష్ట్రపతి మీడియా కార్యదర్శి అజయ్ కుమార్‌సింగ్ తెలిపారు.  28న తిరిగి ఢిల్లీకి వెళ్తారు.