పౌరసత్వ చట్టంపై ఇరకాటంలో శివసేన 

పౌరసత్వ సవరణ చట్టంపై ఎలాంటి వైఖరి తీసుకోవాలో తెలియక శివసేన ఇరకాటంలో పడింది. బహిరంగంగా వ్యతిరేకించలేక, ఇతర ప్రతిపక్షాలతో కలసి నిరసనలతో పాల్గొనలేక తికమక పడుతున్నది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మూడు జుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించాయి. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం నడుస్తున్న శివసేన వెళ్లలేదు.

‘‘మేము ఎన్డీయేకి దూరంగా ఉన్నాం. కానీ యూపీఏలో భాగస్వాములం కాదు. పార్లమెంట్‌లో మాకు ప్రత్యేక ఉనికి ఉంది’’ అంటూ ఈ విషయమై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అయితే లోకసభలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో శివసేన ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించింది. కానీ రాజ్యసభలో  వ్యతిరేకించి, ఓటింగ్ లో  పాలగొనలేదు. 

ఒకవేళ ఈ బిల్లుపై మహారాష్ట్రలో తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు మద్దతిస్తే ‘హిందూ ద్రోహి’ అని బీజేపీ ముద్ర వేసే అవకాశముంది. ఒకవేళ బిల్లును సమర్థిస్తే కాంగ్రెస్‌తో బంధం చెడిపోయే ప్రమాదముంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో శివసేన చిక్కుకుపోయిన్నట్లు కనిపిస్తున్నది. 

ఒక వంక, పౌరసత్వ చట్టానికి వ్యతిరేక ఆందోళనల్లో తాము పాల్గొనేది లేదని అధికార భాగస్వామ్య పక్షాలు- కాంగ్రెస్‌, ఎన్సీపీలకు స్పష్టం చేసింది. కాంగ్రెస్, ఎన్‌ఆర్‌సీ-వ్యతిరేక ఫ్రంట్‌లో చేరబోమని ప్రకటించింది. అదే సమయంలో పౌరసత్వ చట్టం విషయంలో కేంద్ర వైఖరిని తీవ్రంగా విమర్శించింది. పౌరసత్వం ఇచ్చే హిందూ శరణార్థులను ఏ రాష్ట్రంలో ఉంచుతారో చెప్పాలని, ఈ విషయమై కేంద్రానికి ఓ ప్రణాళిక అంటూ ఏమీ లేనట్లు కనిపిస్తోందని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శించారు.  

మరోవంక తాను రాహుల్ సావర్కర్‌ను కాదని రాహుల్ గాంధీ ఇటీవలే ప్రకటించిన్నప్పుడు శివసేన అప్రమత్తంగా వ్యవహరించింది.   సావర్కర్ వీరుడని, పరమ దేశ భక్తుడని, నెహ్రూ, గాంధీ ఎలాగో సావర్కర్‌ని కూడా అలాగే గౌరవించాలని కాంగ్రెస్‌‌కు ఝలక్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా ఖంగుతింది.

ఈ విషయాలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను ప్రశ్నించగా, కాంగ్రెస్‌తో ఈ ఒక్క అంశంపైనే విభేదించలేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని, వాటిపై తాము స్వతంత్రంగానే వ్యవహరించామని స్పష్టం చేస్తున్నారు. రాజీ ధోరణులతో  ప్రభుత్వాన్ని కాపాడుకోవడమా, తన సైద్ధాంతిక ప్రాతిపదికను కాపాడుకోవడమా తేల్చుకోవాల్సిన పరిస్థితులు త్వరలో వచ్చే అవకాశం ఉన్నాయని శివసేన నేతలు భావిస్తున్నారు. 

‘‘‘మహా వికాస్ అగాఢీ’ పేరుతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు మేము ఓ షరతు పెట్టుకున్నాం. ఏవైనా ముఖ్య సంఘటనలు గానీ, సిద్ధాంతపరమైన నిర్ణయాలు గానీ తీసుకునే క్రమంలో ముగ్గురమూ చర్చించుకొని, ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే దానిపై ముందుకెళ్లాలి. తలోదారిలో వెళ్లకూడదని అనుకున్నాం. కానీ శివసేన మాత్రం తద్భిన్నంగా వెళుతూ, సంకీర్ణ ధర్మానికి తూట్లు పొడుస్తోంది’’ అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.