పౌరసత్వ చట్టంతో పాటు ఎన్నార్సీ అమలు తథ్యం  

కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా స్పందించారు. జాతీయ పౌరసత్వ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, ఎన్నార్సీని కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ఆయన మండిపడ్డారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ఇంతటి ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో నివసిస్తున్న మూడు దేశాల మైనారిటీల దుస్థితిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మూడు దేశాల మైనారిటీలు భారత్‌లో 30 ఏళ్లుగా ఉంటున్నారని, కనీసం వారి పిల్లలను పాఠశాలలో చేర్పించలేదని, కనీసం ఓ ఇంటిని కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. 

ఇవన్నీ చూడకుండా పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం ఆందోళనలు చేస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. మూడు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయని చురకంటించారు. 

గురువారం ఆయన ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వలసొచ్చిన సిక్కు శరణార్థులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అప్రతిహతంగా అభివృద్ధి చెందుతుందని, ఇక ముందు కూడా అభివృద్ధి చెందుతుందని నడ్డా భరోసా వ్యక్తం చేశారు.