స్లిప్పర్లు వేసుకునేవారూ విమానాల్లో ప్రయాణించాలి

స్లిప్పర్లు (హవాయి చెప్పులు) వేసుకునేవారు కూడా విమానాల్లో ప్రయాణించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సిక్కిం రాష్ట్రంలో నిర్మించిన మొట్టమొదటి విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అభివృద్ధి చరిత్రలో ఈశాన్యభారతాన్ని చోదకశక్తిలా నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

ఈ ప్రాంతం వెనుకబాటుకు గత ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. కొత్తగా ప్రారంభించిన పాక్యాంగ్ ఎయిర్ పోర్ట్‌తో కలిపి దేశంలో 100 విమానాశ్రయాలు ఉన్నాయని, హవాయి చెప్పల్ ధరించిన వారు కూడా హవాయి జహాజ్ (విమానం)లో వెళ్లేలా చేస్తామని పునరుద్ఘాటించారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దేశంలో కేవలం 65 విమానాశ్రయాలను మాత్రమే నిర్మించారని, గత నాలుగేండ్లలో తాము 35 విమానాశ్రయాలను నిర్మించామని చెప్పారు. తంలో సగటున ఏడాదికి ఒక విమానాశ్రయం చొప్పున వస్తుంటే తాము దీనిని తొమ్మిదికి పెంచామని చెప్పారు. గత 70 ఏండ్లలో దేశంలో కేవలం 400 విమానాలు మాత్రమే ఉండేవని.. కానీ గత ఒక్క ఏడాదిలోనే వివిధ విమానయాన సంస్థలు 1000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయని తెలిపారు.

ఈశాన్యంలోని మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే, వైమానిక అనుసంధానం పెంచామని పేర్కొన్నారు. మొదట నేపాలీ భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. వచ్చేనెల 4వ తేదీ నుంచి కొత్త విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఉడాన్‌ కింద రూ.2500 లోపు ధరకే విమాన టికెట్లు లభ్యమవుతుండడంతో అన్ని వర్గాల ప్రజలూ విమానాశ్రయాలను వాడుకోగలుగుతున్నారు’ అని చెప్పారు. ప్రభాత వేళ సిక్కిం సహజసిద్ధ అందాలను చూశాక తన కెమేరాకు పని చెప్పకుండా ఉండలేకపోయాననీ, ఇక్కడి ప్రజలు కూడా ప్రకృతి అంత అందమైనవారని అన్నారు. ఈ విమానాశ్రయాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా పేర్కొన్నారు.

చైనా సరిహద్దు ఇక్కడకు కేవలం 60 కి.మీ. దూరంలోనే ఉంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తున ఉన్న ఈ ఊరికి సమీపంలో విమానాశ్రయం నిర్మించడానికి ఏకంగా ఓ కొండను చదును చేశారు.  కొండ శిఖరాన 201 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా స్థలాన్ని సిద్ధం చేయడంతో దీనిని ‘గ్రీన్‌ఫీల్డ్‌’ విమానాశ్రయంగా పరిగణిస్తున్నారు.