సిఎం వ్యాఖ్యలపై రాజధాని రైతుల ఆగ్రహం  

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజధాని అమరావతి పరిధిలోని రైతులు భగ్గుముంటున్నారు. ఐదేళ్ల కిందట భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

గత ప్రభుత్వం ప్లాట్లు ఇస్తామని చెప్పి అప్పగించలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ప్లాట్లు అప్పగింతపై నోరు మెదపడం లేదు. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానులను ప్రకటించి అమరావతి ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం ప్రకటనకు నిరసనగా గురువారం రాజధాని గ్రామాల బంద్‌కు పిలుపునిచ్చారు.

 ప్రజలంతా రోడ్డుపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని రైతు నాయకులు కోరారు. రాజధాని గ్రామాల్లో రైతులంతా బుధవారం రోడ్డు పైకి వచ్చారు. రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్ధండ్రాయునిపాలెంలో రైతులు సమావేశమయ్యారు. గురువారం రాజధాని గ్రామాల బంద్‌ పాటించాలని, రాస్తారోకో చేపట్టాలని, సచివాలయానికి వెళ్లే ఉద్యోగులను అడ్డుకోవాలని, ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉధృతంగా ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 

మూడు రాజధానుల ప్రకటనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాజధానిని మారిస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పలువురు రైతులు పురుగు మందుల డబ్బాలతో ముందుకు రాగా పోలీసులు వారిని నిరోధించారు.

రెండున్నర గంటలపాటు రైతులు రాస్తారోకో చేశారు. దీంతో, తుళ్లూరు, మందడంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. తామే అరెస్టవుతామంటూ సుమారు 250 మంది రైతులు పోలీసు స్టేషన్‌ వరకూ నడుచుకుంటూ వెళ్లి స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. మందడంలో ప్రధాన రహదారిపై చేపట్టిన నిరసన, ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. 

వెలగపూడి-ఉండవల్లి మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మందడంలో రైతులు రోడ్డుపై నిరసన తెలుపుతుండగా ఓ వ్యక్తి 'జై విశాఖ' అన్న ప్ల కార్డును ప్రదర్శించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు అడ్డుకుని అతనిపై దాడికి ప్రయత్నిస్తున్నారని తెలిసి పోలీసులు నియంత్రించారు.