కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా హెచ్చరిక 

మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, ఇదేమీ చిన్నపిల్లలాట కాదని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తేల్చిచెప్పారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం అంత సులువు కాదని, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఆటకాయితనంగా, అవగాహనలేక.. సీఎం జగన్‌ ఒక రాయి వేశారని మండిపడ్డారు. 

అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారో తనకు అర్థం కాలేదని.. కానీ మూడు రాజధానులనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులను పెట్టుకున్నట్లుగా మూడేసి రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు.  అమరావతి నుంచి గ్రోత్‌ ఇంజన్‌ను తరలించడం.. జగనే కాదు ఆయన తాతగారు వచ్చినా జరగదని తేల్చిచెప్పారు.

అమరావతిలో శాసనసభ మాత్రమే ఉంటే దాన్ని రాజధాని అనరని స్పష్టం చేశారు. ‘అమరావతి ఇప్పటికే రాజధానిగా ఏర్పడింది. సర్వే ఆఫ్‌ ఇండియా తన మ్యాప్‌లో రాజధానిగా గుర్తించింది. ఇప్పుడు చిన్నపిల్లలాటలాగా తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు. అంతవరకు నేను ప్రజలకు భరోసా ఇవ్వగలను. ఇది బీజేపీ ప్రతినిధిగా మాట్లాడడం లేదు’ అని తెలిపారు. 

ఈ గందరగోళానికి సంబంధించి తాను కేంద్రానికి సమాచారమిచ్చానని పేర్కొన్నారు. జగన్‌ ప్రస్తుతం ఊహాజనితంగా చెప్పారని, కానీ అధికారికంగా చేస్తే మాత్రం కేంద్రం తగినరీతిలో స్పందిస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి నిర్మాణం కోసమే కేంద్రం రూ.2,500కోట్లు ఇచ్చిందని, కానీ బుర్రాబుద్ధి ఉన్నవాళ్లేవరూ అసెంబ్లీ నిర్మాణానికి అన్ని కోట్లు ఇవ్వరు కదా.. అని ఎద్దేవా చేశారు. 

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిందని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ‘సచివాలయ ఉద్యోగులు అనేక కష్టాలు పడి హైదరాబాద్‌ నుంచి అమరావతి వచ్చి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు. ఇప్పుడు విశాఖకు వెళ్లాలంటే మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం ఒక సవాల్‌’ అని చెప్పారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, కానీ ఇది పద్ధతి కాదని హితవు చెప్పారు. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని, రాజకీయ దూషణలు, కక్షసాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబ్టారు. ఇతంతా ప్రజలను ఏడిపించడానికే చేస్తున్నట్లు అనిపిస్తోందని విమర్శించారు. జగన్‌ తీరుతో రాష్ట్రం పదేళ్లు వెనక్కివెళ్లేలా ఉందని, ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని అర్థమవుతోందని చెప్పారు. అధికారులు కూడా గందరగోళంలో పడ్డారని, నిస్సహాయంగా ఉన్నారని తెలిపారు.

ఇలా ఉండగా, రాజధాని విషయంలో ప్రాంతాల వారీగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సూచించారు. రాజధానిలో ప్రజా ప్రయోజనాల కోణం ఉండాలే కానీ, రాజకీయ కోణం ఉండకూడదని స్పష్టం చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని హితవు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గతంలోనే బీజేపీ డిమాండ్‌ చేసిందని, ఇది అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు.