పౌరసత్వ చట్టం ప్రభావం భారతీయులపై ఉండదు  

పౌరసత్వ చట్టం ప్రభావం భారతీయులపై ఉండదని ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. అయితే జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్‌సీ)కి తాము మద్దతివ్వబోమని తెలిపారు. ఒడిశా ప్రజలు అపోహలు నమ్మవద్దని శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. 

పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు బీజేడీ కూడా సహకరించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో భారత పౌరులకు పని లేదని తెలిపారు. ఇది కేవలం విదేశీయులకు సంబంధించినదని చెప్పారు. వదంతులను ప్రచారం చేయవద్దని కోరారు.

ఈ చట్టంపై నిరసనలు తెలియజేస్తున్న ఒడిశాకు చెందినవారిని ఉద్దేశించి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఈ చట్టం భారతీయ ముస్లింలపై ఎటువంటి ప్రభావాన్నీ చూపదని, అందువల్ల అలజడి సృష్టించవద్దని కోరారు.

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతివ్వడం ద్వారా బీజేడీ తన లౌకికవాద ముద్రను వదిలేసుకుందని మైనారిటీ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో నవీన్ పట్నాయక్ ఈ వివరణ ఇచ్చారు.

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా  ఇదే విధంగా వివరణ ఇచ్చారు. ఈ చట్టం ప్రభావం ముస్లింలతో సహా ఏ భారతీయ పౌరుడిపైనా ఉండబోదని చెప్పారు. అందరూ గర్వించదగిన భారతీయ పౌరులేనని చెప్పారు. హింసాత్మకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.