నీరవ్ మోదీకి బహిరంగ సమన్లు

నీరవ్ మోదీ, ఆయన సోదరి పూర్వీ మోదీ, సోదరుడు నిషాల్ మోదీలకు పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం ప్రత్యేక కోర్టు బహిరంగ సమన్లు జారీ చేసింది. ప్రముఖ జాతీయ దినపత్రికల్లో ఈ ముగ్గురికీ నోటీసులను కోర్టు ఇచ్చింది. వచ్చే నెల 25లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని ముంబైలోని ఈ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ సదరు నోటీసుల్లో ఆదేశించారు. హాజరుకాని పక్షంలో చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు.

 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.14,000 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి మొదట్లోనే నీరవ్ దేశం విడిచి పారిపోయిన సంగతీ విదితమే.

కాగా, పూర్వీ, నిషాల్ కూడా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తున్నది. పీఎన్‌బీ స్కాం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వీరి జాడ లేదంటున్నది. ఈ క్రమంలో తాజా నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 25న ఉదయం 11 గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని నోటీసుల్లో కోర్టు స్పష్టం చేసింది.