3000 కిమీ మైలురాయి దాటిన జగన్ యాత్ర

ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం 3,000 కిమీ మైలురాయిని అధిగమించింది. నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర 11 జిల్లాలో పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాకు చేరుకొంది. ఈ జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలలో పూర్తి చేయవలసి ఉంది. 

చంద్రబాబునాయుడు పాలనపై విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని దుయ్యబడుతూ, వచ్చే ఎన్నికలలో తాను అధికారంలోకి వస్తే చేయనున్న కార్యక్రమాలను వివరిస్తూ యాత్ర సాగిస్తున్నారు. యాత్ర సమయంలో ఎక్కడుంటే అక్కడ పార్టీ సమావేశాలు జరుపుతూ 2019 ఎన్నికలకు పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేస్తున్నారు. 

విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పైలాన్‌ను  జగన్‌ ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను అక్కడ నాటారు. 

చారిత్రాక ఘట్టానికి సాక్షులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.  పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కూడా  కొనసాగాయి.

ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల జగన్ మోహన్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు హర్షం ప్రకటించారు. తన ఆనందాన్ని ట్విటర్‌ ద్వారా వ్యక్త పరిచారు.

‘ఈరోజు మూడువేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతి. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజు ప్రేరణ’గా నిలుస్తుందని వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు. 

ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు.

269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో మాట్లాడుతూ  ‘అరకు ఎమ్మెల్యే ఒక దుర్ఘటనలో మృతి చెందడం మనందరికి తెలిసిన విషయమే. ఆ ఎమ్మెల్యే మన పార్టీ వదిలి మనకు మోసం చేసినప్పటికి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'  ప్రసంగాన్ని ప్రారంభించారు. 

ఈ నియోజకవర్గంలో నడుస్తుండగా.. ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు.. 2004 ఎన్నికలు తప్పా ప్రతీసారి తెలుగుదేశం గెలిపించామన్నా. ఈ ముప్పై ఏళ్లలో కనీసం మూడంటే మూడు గుర్తుకుపెట్టుకునే పనులు చేయలేకపోయారన్నానని చెప్పారు.