సీడ్‌ క్యాపిటల్ మారిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సీడ్‌ క్యాపిటల్ అమరావతిని మారిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  సచివాలయం ఒక చోట, హెచ్‌వోడీలు, హైకోర్ట్‌ మరో చోట అంటూ పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

పరిపాలన వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని  ముఖ్యమంత్రికి ఆయన హితవు చెప్పారు.  ఒక్క అవకాశం ఇవ్వండి.. స్వర్గం చూపిస్తానన్న జగన్‌.. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో తెలియడం లేదని కన్నాఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ అనుభవరాహిత్యం, ఆత్రుత వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిందని ధ్వజమెత్తారు. 

తన హయాంలో చంద్రబాబు ఇష్టానుసారం డబ్బులు తగలేశారని పేర్కొంటూ ప్రజల ఆస్తులను  చంద్రబాబు తాకట్టు పెడితే.. జగన్‌ అమ్మేస్తున్నారని కన్నా విమర్శించారు. 6 నెలల్లో అధికార యంత్రాంగంపై జగన్‌ పట్టు కోల్పోయారని దయ్యబట్టారు. జగన్‌ నియంతృత్వాన్ని సొంతపార్టీ ఎంపీలు, నేతలు సహితం తప్పుబడుతున్నారని తెలిపారు. 

అమిత్‌ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అధికారపక్ష నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము ఢిల్లీ వెళ్లినప్పుడే కలవాలి అనుకోవడం సరికాదని కన్నా పేర్కొన్నారు. 

పోలవరం, విద్యుత్‌ ఒప్పందాలపై కేంద్రం మాటను రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదని విమర్శించారు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్న ధోరణిలో జగన్‌ వెళ్తున్నారని పేర్కొంటూ  ఈ ధోరణి వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఏబీఎన్‌తో కన్నా హెచ్చరించారు.