తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బిజెపినే!

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది బీజేపీయే అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న పార్టీ కూడా బీజేపీయే అని తెలిపారు. బీజేపీతోనే బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని లక్ష్మణ్ చెప్పారు. 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని, అన్ని జిల్లాల్లో చేరికలు పెరిగాయని తెలిపారు. . టీఆర్‌ఎస్ పాలనలో మోసపోయామంటూ అనేకమంది స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు.సూర్యాపేట లో  బీఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా, లక్ష్మణ్ మాట్లాడుతూ  కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన పడకేసిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదని దయ్యబట్టారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌కు పట్ట్భాషేకం చేసేందుకే యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారని తెలిపారు.  ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలను తీవ్రతరం చేసి మెడలు వంచి తీరుతామని స్పష్టం చేశారు. 

పౌరసత్వ సవరణ బిల్లుపై గగ్గోలు పెడుతూ మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.  దేశ స్వాతంత్య్ర సమయంలో తొలి ప్రధాని పండిత్ జవహార్‌లాల్ నెహ్రూ చేసిన తప్పిదాల వల్ల నేటికీ దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు. 

ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దశలవారీగా ప్రక్షాళన చేస్తూ అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్టు చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ దేశంలో మత విద్వేషాలను పెంచేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ వల్లే దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ వంతపాడటం సిగ్గుచేటన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు మద్దతుగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు దేశానికి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.