పౌరసత్వంపై వెనక్కి తగ్గేది లేదు 

పౌరసత్వ సవరణ చట్టం అమలుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెగేసి చెప్పారు. ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేసి తీరాల్సిందేనని, దిక్కరించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా కేంద్రం చేపట్టిన చట్టమని పేర్కొంటూ ఇందులో రాష్ట్రాల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేదని తెలిపారు. 

ఈ చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దేశంలో హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింలు అందరికీ భారతీయ పౌరసత్వాన్ని కల్పిస్తామని ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆయన సవాలు విసిరారు. 

పౌరసత్వ కొత్త చట్టంలో మైనార్టీలకు వ్యతిరేకమైన అంశం ఏమీ లేదని, దీని వల్ల ఎవరి పౌరసత్వం హరించుకు పోదని స్పష్టం చేశారు. ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ రిజిస్ట్రీ (ఎన్‌ఆర్‌సి)ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగిన అమిత్‌షా ’అసలు ఎన్‌ఆర్‌సీ రాజీవ్ గాంధీ హయాంలో కుదిరిన అస్సాం ఒప్పందంలో భాగంగానే తెరపైకి వచ్చింది’అని గుర్తు చేశారు. అలాగే పౌరసత్వ చట్టానికి పునాది వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. 

‘పౌరసత్వ సవరణ చట్టం అమలులో వెనక్కి తగ్గేది లేదు. నేనూ, మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాం’అని మంగళవారం జరిగిన ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లోతెలిపారు. ఈ చట్టం న్యాయపరీక్షను తట్టుకుని నెగ్గగలదన్న ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో కూడా ఈ చట్టాన్ని గట్టిగా సమర్థించుకోగలుగుతామని, కచ్చితంగా ఇది న్యాయపరీక్షలో నెగ్గితీరుతుందని పేర్కొన్నారు. 

మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలకు ఈ చట్టం ఏ విధంగా వ్యతిరేకమో తనకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు,ఆమ్ ఆద్మీ పార్టీలు ఉద్దేశ పూర్వకంగానే ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నాయని విరుచుకు పడ్డారు. తమ పౌరులకు సంబంధించిన రిజిస్ట్రీ లేని దేశం మంటూ ఈ ప్రపంచంలో ఉందా అని విపక్షాలను అమిత్ షా నిలదీశారు.