ముస్లింలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ 

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా ముస్లింల‌ను కాంగ్రెస్ రెచ్చ‌గొడుతోంద‌ని ప్ర‌ధాని మోదీ ఆరోపించారు. జార్ఖండ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌సంగించిన మోదీ.. పౌర‌స‌త్వ బిల్లు వ‌ల్ల ఏ మ‌త‌స్థులకు ప్ర‌మాదం ఉండ‌ద‌ని భరోసా ఇచ్చారు. 

గ‌తంలోనూ ఈ విష‌యాన్ని చెప్పానని, ఇప్పుడు కూడా స్ప‌ష్టం చేస్తున్నాన‌ని తెలిపారు. క్యాబ్ వ‌ల్ల ఏ మ‌త‌స్థుడి పౌర‌స‌త్వంపై ప్ర‌భావం ఉండ‌ద‌ని స్పష్టం చేశారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుపై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తోంద‌ని మోదీ విమ‌ర్శించారు. 

వాళ్లు అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారని, హింస‌ను ప్రేరేపిస్తున్నార‌ని, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కాంగ్రెస్ పార్టీ ముస్లింల‌ను ప్రేరేపిస్తున్న‌ద‌ని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ‌ల‌లో విద్యార్థులు ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

ముస్లింలలో అనవసరంగా అభద్రతా భావాన్ని పెంచుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇవ్వాలా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇస్తామని ప్రకటించండని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు.

‘‘ఈ చట్టం ద్వారా ఈ దేశంలోని ఏ ఒక్క పౌరుడూ ఇబ్బంది పడకూడదనే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ఈ విషయం చాలా సార్లు చెప్పాను, మరోసారి చెబుతున్నాను. మేము చేసిన చట్టం పొరుగు దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైనారిటీల కోసం"అని ప్రధాని స్పష్టం చేశారు. 

నూతన పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తూ ముస్లింలలో అభద్రతా భావాన్ని కల్పించి రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నాయని ప్రధాని విమర్శించారు. . కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు బహిరంగ సవాలు విసురుతూ . వాళ్లకు పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇవ్వాలనుకుంటే బహిరంగంగా ప్రకటించండి. దేశ ప్రజలే వారికి సమాధానం చెప్తారని మోదీ హెచ్చరించారు. 

మీ విలువ మీరు తెలుసుకోవాలి, విద్యాసంస్థ‌ల విలువ తెలుసుకోవాల‌ని ఆయ‌న విద్యార్థుల‌కు సూచ‌న చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను చ‌ర్చించాలి, వాటిని ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎదుర్కోవాల‌ని హితవు చెప్పారు. తమ ప్ర‌భుత్వం విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను ఆల‌కిస్తుంద‌ని మోదీ అభయ మిచ్చారు. అర్బ‌న్ న‌క్స‌ల్స్ ఉచ్చులో విద్యార్థులు ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న హెచ్చరించారు.