అల్లర్లు, నిరసనలు వెనుక కాంగ్రెస్ పాత్ర  

దేశంలో అల్లర్లు, నిరసనలు చెలరేగడం వెనుక కాంగ్రెస్ పాత్ర ఉందని, వారిని ఎగదోస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు.  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న వారి వెనుక కాంగ్రెస్, దాని మిత్రపక్షాలున్నాయని తీవ్రంగా ఆరోపించారు.

జార్ఖండ్‌లోని ధమ్కాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్య కూటమిపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌కు, దాని మిత్ర పక్షాలకు సరైన అవగాహన లేదని విమర్శించారు.

‘‘కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ ఈశాన్య రాష్ట్ర ప్రజలు హింసను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలను చూస్తుంటే, పార్లమెంట్‌లో తీసుకొచ్చిన చట్టాలన్నీ సరైనవే అన్న భావన వస్తోంది’’ అని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నేతలు వారికి ఏం కావాలో చూసుకుంటారే తప్ప, దేశ ప్రజల అవసరాలను తీర్చరని మండిపడ్డారు.

పొరుగు దేశాల్లో హింసలకు గురైన వారిని భారత పౌరులుగా మార్చడానికి అనుమతించిందే పౌరసత్వ సవరణ బిల్లు అని, ఈ చట్టాన్ని తీసుకురావడం వెయ్యి శాతం సరైన చర్య అని ఆయన సమర్థించారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాలో మైనారిటీలుగా ఉన్న సమూహాలు చాలా బాధలు పడ్డారని, వారి జీవితాలను మరింత మెరుగు పరచడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికే చట్టాన్ని తీసుకొచ్చామని మోదీ పేర్కొన్నారు.