పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి పరిష్కారం

పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని, పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. బోర్డుల వల్ల పంటలకు న్యాయం జరగడం లేదని, త్వరలో కొన్ని బోర్డులు రద్దు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం పసుపు పంటకి బోర్డుతో ఉండే అధికారాలతో పాటు, సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేస్తుందని వివరించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏడాది రూ.100 నుంచి రూ.200 కోట్ల నిధులు ఇవ్వనున్నామని ఎంపీ ధర్మపురి చెప్పారు. 

ఇకపై రైతులకు సీడ్, ఎరువులు, అమ్మకం, కొనుగోలు, ఇన్సురెన్స్, క్వాలిటీని కూడా ఇక్కడే నిర్ణయిస్తామని, పసుపు బోర్డు కన్నా మంచి స్కీం పసుపు రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. పసుపు రైతులు రాజకీయ నాయకుల వలలో పడొద్దని సూచించారు. 

ఆంధ్రలో జగన్ పసుపుకి మద్దతు ధర ప్రకటించినప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకి మద్దతు ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వుందని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.