మణిపూర్ సీఎం సోదరుడి అపహరణ యత్నం 

కలకలం రేపిన మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ సోదరుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కోల్‌కతా పోలీసులు కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితులను పట్టుకొన్నారు. 

దుండగులు సీబీఐ అధికారులమని చెప్తూ కోల్‌కతా న్యూటౌన్‌ ప్రాంతంలోని లుఖోయిసింగ్‌ ఉంటున్న అద్దె ఇంట్లోకి ప్రవేశించారని, బొమ్మ తుపాకీలు చూపించి అతడితోపాటు సహాయకుడిని కిడ్నాప్‌ చేశారని పోలీసులు శనివారం వెల్లడించారు. 

ఆ తర్వాత దుండగులు.. లుఖోయిసింగ్‌ భార్యకు ఫోన్‌చేసి రూ.15 లక్షలు తీసుకొస్తేనే విడిచిపెడతామని డిమాండ్‌చేసినట్టు పేర్కొన్నారు. ఆయన భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  కోల్‌కతాలోని బెనియాపుకూర్‌ ప్రాంతంలో ఐదుగురు దుండగులను అరెస్టు చేసి, కిడ్నాపైన ఇద్దరిని సురక్షితంగా కాపాడినట్టు పోలీసులు తెలిపారు. 

నిందితుల్లో ఇద్దరిది మణిపూర్‌, మరో ఇద్దరిది కోల్‌కతా కాగా మరొకరిది పంజాబ్‌ అని తేల్చారు. కోల్‌కతాకు చెందిన నిందితులకు నేరచరిత్ర ఉన్నట్టు గుర్తించారు. నిందితులు దొరికిన ప్రాంతంలో రెండు వాహనాలను, మూడు బొమ్మ తుపాకీలు, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.