కాంగ్రెస్‌కి    ‘కడుపు నొప్పి’   పట్టుకోంది 

పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి ‘కడుపు నొప్పి’ పట్టుకుందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సాంఘిక గుర్తింపు, భాష, రాజకీయ హక్కులకు ఎటువంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. వారి ప్రత్యేకతను కాపాడటం కోసం తమ ప్రభుత్వం నిబద్దతతో ఉన్నదని స్పష్టం చేశారు. అయినా అక్కడి ప్రజలను  ప్రతి పక్షాలు రెచ్చగొట్టుతున్నాయని దుయ్యబట్టారు. 

జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా గిరిడిలో జరిగిన బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సాంఘిక గుర్తింపు, భాష, రాజకీయ హక్కులను ఏ విధంగానూ స్పృశించబోమని హామీ ఇచ్చారు. వీటన్నిటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు.

కేవలం మైనారిటీలను సంతృప్తి పరచడం కోసం ఈ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ లలో మతపరమైన వివక్షత దాడుల కారణంగా శరణార్థులుగా గెంటివేయబడిన వారికి `గౌరవం' కల్పించడం కోసమే ఈ చట్టం ఉద్దేశించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. 

ఓట్ బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ ఆర్తికి 370 రద్దు, ట్రిపిల్ తలాక్ రద్దు, పౌరసత్వ చట్టం వంటి వాటిని మైనారిటీలకు వ్యతిరేక చర్యలుగా ముద్ర వేయడానికి అలవాటు పడినదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చాలాకాలంగా, కాంగ్రెస్ పార్టీ హిందూ-ముస్లిం రాజకీయాలకు పాల్పడి, నక్షలైట్లు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్త్తున్నదని విమర్శించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి నిర్ణయం తీసుకొంటే ఓట్ బ్యాంకు రాజకీయాలు అంటూ విమర్శలు కురిపిస్తున్నారని దుయ్యబట్టారు.