మళ్లీ అధికారంలోకి రాగానే అక్రమ శరణార్థులపై వేటు

తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అక్రమంగా చొరబడిన శరణార్థులను గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, చొరబాటుదారుల కొమ్ముకాసేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. దేశ రాజధానిలో కూడా అక్రమ చొరబాటుదార్ల బెడత తీవ్రంగా ఉందని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రతి చోట అక్రమ చొరబాటుదారులను గుర్తించే కార్యక్రమం చేపడుతామని వెల్లడించారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాలా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారుతారని మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ఏడు లోక్‌సభ సీట్లలో తమ పార్టీ మళ్ళి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

అక్రమ శరణార్థులను గుర్తించేందుకు అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్ కార్యక్రమాన్ని చేపట్టాలనే డిమాండ్‌లు వస్తున్నాయని గుర్తు చేసారు. శరణార్థుల వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని చెబుతూ శరణార్థులు అక్రమంగా చొరబడి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఇద్దరు నేతలు వారిని వెనకేసుకుని వస్తున్నారని ద్వజమెత్తారు. దేశ ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకుపైనే ఈ ఇద్దరు నేతలు గురిపెట్టారని  ఎద్దేవా చేసారు.

ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా ఆమ్ ఆద్మీపార్టీ పెట్టుకుందని విమర్శించారు.  ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం గత నాలుగున్నరేళ్లలో రూ.50 వేల కోట్ల నిధులు మంజూరుచేసిందని చెబుతూ అయినా అభివృద్ధికి నిధులు వెచ్చించకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక విపక్షాలు మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెబుతూ అయితే వీరిని ప్రజలు ఆదరించడం లేదని స్పష్టం చేసారు.

మహాకూటమికి నాయకుడు లేరని, విధానాలు లేవని ఆయన దుమ్మెత్తిపోశారు. రాహుల్ గాంధీ మహాకూటమి కావాలంటున్నారని, మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఒకే వేదికపైకి రావడానికి తటపటాయిస్తున్నారని గుర్తు చేసారు. తూర్పుయూపీ, ఒడిశా, జార్ఖాండ్, బీహార్ రాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్ హై వే ఇతర వౌలిక సదుపాయాలకు కేంద్రం రూ.13 లక్షల కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ దేశరాజధానిలో బంగ్లాదేశ్, రోహింగ్యా వర్గం వారు శరణార్థులుగా వచ్చి తిష్ట వేశారని చెబుతూ వీరిని గుర్తించి వెనక్కు పంపించి వేస్తామని స్పష్టం చేసారు.