ఇంటి పేరు వచ్చినంత మాత్రాన దేశభక్తులా?  

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహించిన ‘భారత దేశాన్ని కాపాడండి’ సభలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఘాటుగా స్పందించారు. శనివారం ఢిల్లీలో  జరిగిన ‘భారత్ బచావో’ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను రాహుల్ సావర్కర్‌ను కాదని, రాహుల్ గాంధీనని చెప్పారు. 

జార్ఖండ్‌లో తాను గురువారం చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. దీనిపై గిరిరాజ్ సింగ్ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు.

‘‘వీర్ సావర్కర్ నిజమైన దేశ భక్తుడు. కేవలం ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రానికి ఎవరూ గాంధీ కానీ, దేశ భక్తుడు కానీ అయిపోరు. నిజమైన దేశ భక్తుడు అవాలంటే ఎవరికైనా భారతీయ రక్తం ఉండాలి. చాలా మంది దేశాన్ని ముసుగు వేసుకుని దోచుకున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌కు రాహుల్, సోనియా, ప్రియాంకల ఫొటోను జత చేశారు. ‘‘ఈ ముగ్గురూ ఎవరు? వీళ్ళు భారత దేశంలో సామాన్యులా?’’ అని ప్రశ్నించారు.