తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే  

‘‘తెలంగాణ మే అగ్లీ బార్‌ హమారీ సర్కార్‌ హోగీ. ఆయనను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు, డీ అరవింద్‌, గరికపాటి మోహన్‌ రావు కలిసినపుడు ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు (తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే)’’ అని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇచ్చారు. 

వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందాక ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ బిల్లును ఉభయసభల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకించింది. ముస్లింలకు తాము అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు సభలో చేసిన ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఎంపీలు వివరిస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు అని ప్రధాని చెప్పినట్టు సమాచారం. 15 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని ఆరా తీసినట్టు తెలిసింది.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయమై దృష్టిసారించాలని ఎంపీలను ప్రధాని కోరారు.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వేర్వేరు కార్యాచరణ రూపొందించుకొని క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు. 

రెండు రోజుల క్రితం ప్రధానిని కలిసిన నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవితో కూడా ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయండి.. తప్పకుండా గెలుస్తారని’ అన్న సంగతి తెలిసిందే. 

‘‘ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశాం. బీజేపీకి తెలంగాణలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు. కచ్చితమైన నివేదికలు ఉన్నాయి కాబట్టే ఈ మాట చెప్పారు. ప్రధాని కూడా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకుడే.. గాలి మాటలు చెప్పరు. ఇది రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలంతా సంతోషించాల్సిన విషయం’’ అని ప్రధానిని కలిశాక అరవింద్‌ మీడియాకు చెప్పారు. 

వచ్చే ప్రభుత్వం బీజేపీదేనన్న నమ్మకం కేంద్రం పెద్దలకు బలంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలమంతా క్రియాశీలకంగా వ్యవహరించినట్లు అరవింద్‌ చెప్పారు. హెచ్‌ఆర్డీ మంత్రి పోఖ్రియాల్‌ నిషాంక్‌ను కలిసి తెలంగాణకు ఐఐఎం, ఐఐఎ్‌సఈఆర్‌ విద్యా సంస్థలను మంజూరు చేయాలని కోరానని, ఆయన చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో నవోదయా విద్యాలయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానని వెల్లడించారు.

పసుపు పంటకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరాయని, రైతులు ఆశించినదాని కంటే ఎక్కువనే ఫలితం ఉంటుందని ఎంపీ అరవింద్‌ పేర్కొన్నారు. ’’పసుపు బోర్డు 30 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్‌. కొత్తగా వచ్చిన డిమాండ్‌ కాదు. బోర్డ్డు పాత వ్యవస్థ. ఈ వ్యవస్థకు మించిన ప్రయోజనాలు రైతులకు కల్పించడానికి చర్చలు జరిగాయి.’’ అని వ్యాఖ్యానించారు. 20-30 రోజుల్లో రైతులకు శుభవార్త వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.