రామమందిరంకు ప్రతి ఇంటినుండి రూ 11, ఒక ఇటుక

దేశంలోని ప్రతి కుటుంబం రామమందిర నిర్మాణానికి 11రూపాయలతో పాటు ఒక ఇటుకను ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్‌ కోరారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక పిలుపు ఇచ్చారు. 

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి వల్లే 500 సంవత్సరాల వివాదం పరిష్కారమైందని కొనియాడారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్ లాంటి రాజకీయ పార్టీలకు వివాదం పరిష్కారమవ్వడం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. అయోధ్యలో రామ్‌మందిర్‌ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు. 

జైశ్రీరాం నినాదాలతో ఆయన ప్రజలను ఉత్తేజపరిచారు. తాను రాముడి స్వస్థలం నుంచి వచ్చానని చెబుతూ రాముడి పాలనంతా రామరాజ్యమేనని కొనియాడారు. సమాజంలోని పేద, యువత, మహిళలు సహా అన్ని వర్గాలను అభివృద్ధి పరచమే తమ అభిమతమని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. 

ఏ వర్గానికి న్యాయం చేయకుండానే  కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎమ్‌ఎమ్‌) లాంటి రాజకీయ పార్టీలు అధికారం కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కాంగ్రెస్‌, ఆర్‌జేడీ, జేఎమ్‌ఎమ్ పార్టీలు విఫలమయ్యావని మండిపడ్డారు. 

ఆర్టికల్‌ 370 వల్ల దేశంలో ఉగ్రవాదం పెరుగుతుందని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ కోరుకుంటున్న ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌ ఆశయాన్ని బలపరచాలని యోగీ అధిత్యనాథ్‌ కోరారు.