కడుపు మాడ్చుకుంటేనే ప్రభుత్వానికి కనువిప్పు

కడుపు మాడ్చుకుంటే కాని ప్రభుత్వానికి కనువిప్పు కల్గదని కేసీఆర్ ప్రభుత్వాన్ని  స్వామి పరిపూర్ణానంద ఎద్దేవా చేశారు.  ఇందిరా పార్క్ వద్ద మహిళ సంకల్ప దీక్ష చేపట్టిన బీజేపీ నేత డీకే అరుణ దీక్షను శుక్రవారం సాయంత్రం కొబ్బరి నీళ్లు ఇచ్చి విరమింపజేశారు. 

సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమత,మానస, దిశ ల తో పాటు అత్యాచారాలకు గురైన మహిళలకై రెండు రోజుల నిరహార దీక్ష చేసిన డీకే అరుణ ఉక్కు సంకల్పం గొప్పదని కొనియాడారు.  రాజకీయాలు పక్కన పెట్టి.. మహిళల కోసం అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. మద్యపాన నిషధం చేస్తే.. సీఎం కేసీఆర్‌కు దిశ ఆశీస్సులుంటాయని చెప్పారు. 

 డ్రగ్స్ కేసు ఏమైందో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. మద్యం తెలంగాణ కల్చర్ కానేకాదని స్పష్టం చేశారు.  తెలంగాణకు మంచి జరుగుతుందంటే ఎవరి కాళ్లయినా పట్టుకుంటానని స్పష్టం చేశారు. 

దిశ ఘటన గురించి మాట్లాడుతూ.. దిశ అనే యువతి భూమి మిదే నరకాన్ని చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ నిందితులది ఎన్ కౌంటర్ కాదని, సర్జికల్ స్ట్రైక్ అని అని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ చేసింది పోలీసులు కాదని, ఆ ఎన్ కౌంటర్  ప్రజల తీర్పు అని చెప్పారు. 

ఈ ఘటనపై జనం నిరసన వ్యక్తం చేయడం వల్లే సజ్జనార్ బయటకు వచ్చాడని స్వామి తెలిపారు. హజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని పోలీసులను పరిపూర్ణానంద  ప్రశ్నించారు. 

ఘటన జరిగిన తర్వాత.. ఎవరికో ఫోన్ చేసే బదులు ఆ అమ్మాయి డయల్ 100 కి ఫోన్ చేయొచ్చు కదా అన్న తెలంగాణ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలను పరిపూర్ణానంద తప్పు బట్టారు. దిశ పాపం అంటకుండా ఉండాలంటే రాష్ట్రంలో  మద్యాన్ని నిషేదించాలని సీఎం కేసీఆర్ కు సూచించారు.  అందుకోసం కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 

మద్యాన్ని నిషేదించాలని స్వామి డిమాండ్ చేశారు.  అత్యాచారాలకి ప్రధాన కారణం మద్యం అని పేర్కొంటూ అవి జరగకుండా ఉండాలంటే తెలంగాణలో మద్యాన్ని నిషేదించాలని ఆయన చెప్పారు. తెలంగాణను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు. 

ఇలా ఉండగా, కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వం సవరణ బిల్లుకు శివసేన వ్యతిరేకించడం సిగ్గుచేటని పరిపూర్ణానంద విమర్శించారు. హిందుత్వం కోసం పుట్టిన శివసేన పార్టీ సెక్యులరిజం చేతిలో బందీ అయ్యిందని  ఆయన అన్నారు.  దుయ్యబట్టారు.