రాహుల్ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం  

భారత్ అత్యాచారాలకు రాజధానిగా మారిపోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. దేశవ్యాప్తంగా మహిళలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ బీజేపీ మహిళా ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 

 దేశంలోని మహిళలందరికి రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ నిన్న ప్రసంగిస్తూ.. భారత్‌ మేకిన్‌ ఇండియా కాదు.. రేప్‌ ఇన్‌ ఇండియా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

రాహుల్‌ గాంధీ దేశంలోని మహిళలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నాడని కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ ప్రశ్నించారు. రాహుల్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మగాళ్లు అందరూ రేపిస్టులు కాదు.. ఆ విషయాన్ని రాహుల్‌ గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. 

స్మృతి ఇరానీ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు.. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కానీ అది ఇప్పుడు రేప్‌ ఇన్‌ ఇండియాగా మారింది. ఎక్కడా చూసినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అంటూ రాహుల్ పేర్కొనడం ఆగ్రవేశాలకు దారితీసింది. 

ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తోంటే, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయని, అలాంటి మేక్ ఇన్ ఇండియాను నినాదాన్ని రేప్ ఇన్ ఇండియా అంటూ వ్యాఖ్యానించడం సరికాదని  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలోనూ బిజెపి ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.