జీఎస్టీ బకాయిలను తప్పక చెల్లిస్తాం

జీఎస్టీ నష్టపరిహార బకాయిలను తప్పక తీరుస్తామని నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు హామీ ఇచ్చారు.  ఆగస్టు నుంచి జీఎస్టీ బకాయిలు రాష్ర్టాలకు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నది. 

ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల  ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు.. నిర్మలను కలిసి తమ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో మంత్రి మాట్లాడుతూ కట్టుబాట్లను తాము గౌరవిస్తామని, బకాయిలను చెల్లిస్తామని స్పష్టం చేశారు. 

జూలై 1, 2017 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినది తెలిసిందే. వివిధ కేంద్ర, రాష్ట్రాల  పన్నులను విలీనం చేసి తెచ్చిన జీఎస్టీతో రాష్ర్టాలకు ఆదాయం దూరమవగా, తొలి ఐదేండ్లు నష్టపరిహారం చెల్లిస్తామని మోదీ సర్కారు హామీ ఇచ్చినదీ విదితమే.  

ఇలా ఉండగా, తెలంగాణకు రావాల్సిన జిఎస్‌టి బకాయిలు త్వరగా విడుదల చేయాలని టిఆర్‌ఎస్ పార్టీ ఎంపిలు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. టిఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపిలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జిఎస్‌టి బకాయిలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లేఖను ఆమెకు అందజేశారు.